calender_icon.png 19 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చగొట్టే వ్యాఖ్యలకు మూల్యం

19-10-2025 12:22:38 AM

  1. జూబ్లీహిల్స్ అభ్యర్థి సల్మాన్ ఖాన్‌పై కేసు
  2. అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశం
  3. ప్రసంగాలు, సోషల్ మీడియా కార్యకలాపాలపై ఈసీ నిఘా

హైదరాబాద్, సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న కొద్దీ వివాదాలు కూడా రాజుకుంటున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగం మేరకు ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదైంది. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదు చేయడంతో బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.

అభ్యర్థుల ప్రచారంపై దృష్టి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి మొదలైనప్పటి నుంచి ప్రచార సరళిపై ఎన్నికల సంఘం, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరిం ది. నాయకుల ప్రసంగాలు, సోషల్ మీడి యా కార్యకలాపాలపై ఈసీ నిఘా పెట్టింది. ఇందులో భాగంగా, హైదరాబాద్ యూత్ కరేజ్  వ్యవస్థాపకుడు, జూబ్లీహిల్స్ అభ్యర్థి అయిన సల్మాన్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్య లు, పోస్టులు వివాదాస్పదంగా మారాయి.

ఈసీ ఫిర్యాదుతో..

ఎన్నికల నిఘా అధికారులు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టింగులను పరిశీలించి, అవి మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని నిర్ధారించుకున్నారు. వారి నివేదిక ఆధారంగా, ఎన్నికల సంఘం ఫిర్యాదు చేయడంతో బోరబండ పోలీసులు సల్మాన్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, తప్పుడు సమాచా రాన్ని ప్రచారం చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.