23-11-2025 12:35:17 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): ది క్రీక్ ప్లానెట్ స్కూల్, సీనియర్ సీడ్స్ క్యాంపస్ వార్షికోత్సవం ‘సంగం 2025’ శనివారం సాయంత్రం బీహెచ్‌ఈఎల్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సైబరాబాద్ కమిషనరే ట్‌కు చెందిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల జాయింట్ కమిషనర్ డాక్టర్ గజరావు భూ పాల్ హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రదీపనతో ప్రారంభించారు.
కార్యక్రమానికి పాఠ శాల చైర్మన్ శ్రీ బొల్లినేని సీనయ్య, వైస్ చైర్మన్ పాండురంగ చారి, హెడ్ అకడమిక్ డాక్టర్ జయశ్రీ నాయర్, సీఓఓ డాక్టర్ జీవని గద్దె, వివిధ శాఖల పాఠశాల ప్రిన్సిపల్స్ హాజరై కార్యక్రమాన్ని మరింత భవ్యంగా మార్చారు. పాఠశాల చిన్నారులు భారతీయ సాంస్కృతిక వారసత్వం, వేదాలు, పురాణాలు, ధర్మం, జానపద కళలు మొదలైన అంశాలపై ఆధారిత నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు.
డాక్టర్ గజరావు భూపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించడంలో విద్య పాత్ర ఎంతో కీలకం అని, ప్రస్తుత కాలంలో మత్తు పదార్థాలు, సైబర్ గేమ్స్ వంటి ప్రమాదకర అంశాలపై విద్యార్థుల్లో సరైన అవగాహన కల్పించడం ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు.
పాఠశాల ప్రిన్సిపల్ ప్రీతి బిస్వాల్ మాట్లాడుతూ.. వేదికపై విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించిన సృజనాత్మకత, ప్రతిభ, నైపుణ్యాలు వారి సమగ్ర అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమం చివరగా విద్యార్థులందరూ కలిసి చేసిన గ్రాండ్ ఫినాలే ప్రదర్శన ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. అనంతరం జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.