calender_icon.png 19 October, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌సీ17కు ముహూర్తం అప్పుడే

19-10-2025 12:22:13 AM

 రామ్‌చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే.  బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 2026 మార్చిలో ఈ సినిమా రిలీజ్ చేస్తామని టీమ్ ప్రకటించింది. అయితే, ఈ ప్రాజెక్టు తర్వాత రామ్‌చరణ్.. దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ‘ఆర్‌సీ17’గా ప్రచారంలో ఉంది. గతంలో రామ్‌చరణ్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా అతనికి గుర్తింపు ఇచ్చింది.

దీంతో ఇప్పుడు ‘ఆర్‌సీ17’పైనా భారీ అంచనాలు మొదట్నుంచే నెలకొన్నాయి. దిలావుంటే, తాజాగా సుకుమార్ సినిమా గురించి టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర విషయం వినవస్తోంది. సుకుమార్ ఈ సినిమా స్క్రిప్టు ను ఫైనల్ చేసేశారని, ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో మొదలుపెడతారని టాక్. ‘పెద్ది’కి సంబంధించిన పనులు పూర్తిగా అయిపోయిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చరణ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో తొలి షెడ్యూల్ షూటింగ్ చేస్తారని అంటున్నారు.

సంక్రాంతికి ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఉంటాయన్న గుసగుసలు వినవస్తున్నాయి. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘డ్యూడ్’ సినిమా ప్రెస్‌మీట్‌తో ఈ సినిమాపై మరింత క్లారిటీ వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైత్రీమూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. “మా బ్యానర్‌లో వచ్చే తర్వాతి సినిమా రామ్‌చరణ్ కాంబో మూవీనే. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మా సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది” అని చెప్పారు.