27-09-2025 12:48:52 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 26, (విజయక్రాంతి) :దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం, జిల్లా కు ప్రత్యేక గుర్తింపు రావడం గ ర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో అమలవుతున్న జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 కార్యక్రమం కింద భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా ప్రత్యేక గుర్తింపు పొందడం, రూ.25 లక్షల నగదు బహుమతి లభించడం గర్వించదగిన విషయం అన్నారు.
జిల్లాలో 32,000 నిర్మాణాలు చేపట్టి,29,103 నీటి సంరక్షణ పనులు పూర్తి చేయడం జరిగింది అని తెలిపారు. ఇంకుడు గుంతలు, నీటికుంటలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, ఊట చెరువులు వంటి వర్షపు నీటి సంరక్షణ పనులు కేవలం గ్రామీణ ప్రాంతాలనే కాకుండా ప ట్టణ ప్రాంతాలకు కూడా ఉప యుక్తం అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పనులు, పంట నీటి కుంటలు వంటి కార్యక్రమాల్లో కూడా వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చిన ఫలితమే ఈ గుర్తింపు అని వివరించారు.జిల్లా ప్రజల సహకారం, స్థానిక సంస్థల భాగస్వామ్యం, గ్రామీణ అభివృద్ధి సంస్థల కృషి వలన ఈ విజయాన్ని సాధించగలిగామని కలెక్టర్ అభినందించారు.
నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల నిల్వ పెంపు, పంటల ఉత్పాదకతలో స్థిరత్వం సాధించడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా వర్షపు నీటి సంరక్షణ పనులను కొనసాగించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీటి వనరుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ సందర్భంగా తెలిపారు.