23-12-2025 02:05:14 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : నిబంధనలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఉమ్మడి జైనథ్ మండలం నుంచి నూతనంగా ఏర్పడిన సాత్నాల మండలంలోని తోయిగూడ పంచాయతీ సర్పంచ్ గా చావన్ అనసూయ ఎన్నికైంది. ఆమె కొడుకు చావన్ చరణ్ సింగ్ సైతం వార్డు మెంబర్‌గా ఎన్నికయ్యాడు. సోమవారం అధికారులు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని చేపట్టారు.
సర్పంచ్‌గా చావన్ అనసూయ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా, ఆమెకు బదులుగా కొడుకు వార్డు మెంబర్ చరణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశాడు. అదేవిదంగా 5వ వార్డు మెంబర్ గా గెలిచిన ఈర్వే వందన ప్రమాణ స్వీకారం మొదలుపెట్టగాని అధికారులు చెప్పిన ప్రమాణ స్వీకారాన్ని అనుసరించకుండా మైక్‌ను తన భర్తకు అందించింది.
దీంతో ఆమెకు బదులుగా భర్త ఈర్వే రవీందర్ ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను పాటించని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారి రమేష్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.