10-01-2026 12:38:26 AM
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షల నిర్వహణ
ఇంటర్ పరీక్షల కోసం 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్
ఖమ్మం టౌన్, జనవరి 9 (విజయ క్రాంతి): జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో జనరల్, ఓకేషనల్ కలిపి మొత్తం 35 వేల 188 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన 66 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, 67 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఉదయం, సాయంత్రం రెండు సెషెన్స్ లో జరుగుతాయని అన్నారు. ఆంగ్లం ప్రాక్టికల్ పరీక్ష మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 21న, రెండవ సంవత్సరం విద్యార్థులకు జనవరి 22న జరుగుతుందని, జనవరి 23న ఎథిక్స్, మానవ విలువలు, జనవరి 24న పర్యావరణ అవగాహనపై ఇంటర్నల్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని అన్నారు.
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించా లని, పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు పరీక్షా కేంద్రాల రూట్ లలో స్పెషల్ బస్సులు నడపాలని అన్నారు.
రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదివే ఇంటర్ విద్యార్దులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో పనిచేసే ఇన్విజిలేటర్ లకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ పద్మశ్రీ , జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కే.రవి బాబు , ఆర్టిసి, విద్యుత్, పంచాయతీ, మునిసిపల్, పోస్టల్, పోలీస్, సంబంధితఅధికారులు పాల్గొన్నారు.