calender_icon.png 10 January, 2026 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెస్రం అల్లుళ్ల సంరక్షణలో పవిత్ర గంగా జలం

10-01-2026 12:38:33 AM

జైనూర్ మండలం గౌరీలో పచ్చని చెట్టుపై భద్రం

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 9 (విజయక్రాంతి): దేశంలో ఆదివాసులు జరుపుకునే జాతరలో రెండో అతిపెద్ద జాతరగా, రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన నాగోబా అభిషేకానికి అవసరమయ్యే పవిత్ర గంగా జలాన్ని భద్రపరిచే బాధ్యత మెస్రం వంశ అల్లుళ్లదే. డిసెంబర్ 30న కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం నుంచి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులో ప్రవహించే గోదావరికి మెస్రం వంశీయులు కాలినడకన చేరుకున్నారు.

మహాపాదయాత్రగా వెళ్లిన మెస్రం వంశపు పెద్దలు ఈనెల 7న గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర గంగా జలాన్ని సేకరించారు. ఆ జలంతో శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మహాపా దయాత్రగా కుమ్రంభీం జిల్లా జైనూర్ మండలం గౌరీ గ్రామ శివారులోకి చేరుకున్నారు. ఇంద్రవెల్లి మండలం వడగావ్ గ్రామానికి చెందిన మెస్రం వంశ అల్లుళ్లు ఆత్రం సాయికిరణ్, ఆత్రం మాధవరావు, కేస్లాపూర్‌కు చెందిన కొచ్చడ గన్ను కలిసి ఆ పవిత్ర గంగా జలాన్ని చెట్టు కొమ్మలపై భద్రపరిచారు.

అనంతరం మెస్రం వంశ పెద్దలు గంగా జలానికి మొక్కి.. ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందినవారు ఇండ్లకు పయనమయ్యారు. ఈ నెల 13న ఎడ్లబండ్లతో గౌరీ గ్రామానికి చేరుకొని  కేస్లాపూర్‌కు పయనమవుతారు. 14న ఇంద్రవెల్లిలోని ఆదివాసుల దేవత ఇంద్రాయకి మొక్కులు చెల్లించి, అదే రోజు రాత్రికి కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయ పరిసర ప్రాంతంలోని మర్రి చెట్ల వద్దకు చేరుకుంటారు.