calender_icon.png 29 December, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ నీటి బిల్లులను రద్దు చేయాలి

28-12-2025 12:00:00 AM

  1. మున్సిపాలిటీలపై జలమండలి వివక్ష
  2. ఉచిత నీటి పథకం వర్తింపజేయాలని డిమాండ్
  3. అధికారులను కలిసిన బీజేపీ నాయకులు

మణికొండ, డిసెంబర్ 27, (విజయక్రాంతి): నార్సింగి సర్కిల్ పరిధిలోని మణి కొండ, నెక్నాంపూర్, గండిపేట, కోకాపేట డివిజన్లలో జలమండలి జారీ చేసిన భారీ నీటి బిల్లులను తక్షణమే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. అంజన్ కుమార్ గౌడ్, మణికొండ మాజీ వైస్ చైర్మన్ కొండకళ్ల నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నార్సింగి సర్కిల్ జలమండలి డీజీఎం శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం మహేష్, మేనేజర్ రామకృష్ణారెడ్డిలను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 సెప్టెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు సుమా రు 56 నెలల బిల్లులను ఒకేసారి జారీ చేయడం ప్రజలపై పెనుభారం మోపడమేనని మండిపడ్డారు.

ఒక్కో వినియోగదా రునికి 70 వేల నుండి 90 వేల రూపాయల వరకు బిల్లులు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలవుతున్న 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలకు ఎందుకు వర్తింపజేయడం లేదని అధికారులను నిలదీశారు. పాత నగరానికి ఒక న్యాయం, మున్సిపాలిటీలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

విచక్షణారహితంగా పంపిణీ చేసిన ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉచిత నీటి పథకాన్ని ఈ డివిజన్లలోనూ అమలు చేస్తూ కొత్త బిల్లులు జారీ చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి. లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి, నాగేష్, రవికాంత్ రెడ్డి, చిలుకూరి బీరప్ప, బిక్షపతి యాదవ్, శివరాజ్, గణేష్, సిద్ధప్ప, రాజేష్, భీమ్ రెడ్డి, బుచ్చిరెడ్డి, వేణు, శివరాజ్ చారి పాల్గొన్నారు.