31-10-2025 12:00:00 AM
-రూపురేఖలు మారనున్న బుగులోని జాతర స్వరూపం
-ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవ
-రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులు భక్తుల్లో హర్షం
రేగొండ, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రకృతి రమణీయత ఉట్టిపడే శోభనీయత రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారు కొండల్లో స్వయంభుగా వెలసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర దినదిన అభివృద్ధిలో ప్రవర్ధమానమవుతోంది.స్వామివారి ఆలయం, జాతర మైదానం ఇప్పుడు నూతన శోభను సంతరించుకున్నాయి. దీనికి ప్రధాన కారణం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు చూపిన ప్రత్యేక శ్రద్ధ, చొరవే అని స్థానికులు తెలుపుతున్నారు.
రికార్డు స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఏ నాయకుడు కూడా చేయని విధంగా,ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏకంగా రూ.7 కోట్లకు పైగా నిధులు కేటాయించి జాతర స్వరూపాన్నే మార్చివేశారని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గండ్ర సత్యనారాయణ రావు దూరదృష్టి, పట్టుదల కారణంగా శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర కేవలం భక్తి కేంద్రంగానే కాకుండా, మౌలిక వసతుల పరంగా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవనుంది. ప్రకృతి అందాల నడుమ వెలసిన స్వామివారికి ఇది నిజమైన పట్టు వస్త్రాల అలంకరణ లాంటిది అని భక్తులు పేర్కొంటున్నారు.
రికార్డు స్థాయి నిధులు, అభివృద్ధికి పరుగులు
రికార్డు స్థాయిలో సుమారు రూ.7 కోట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టారు.రూ.2 కోట్ల వ్యయంతో మెట్లను వెడల్పు చేసి, భక్తులు సౌకర్యవంతంగా స్వామివారి కొండ పైకి దర్శనానికి వెళ్లేలా చేశారు. కోనేరు, మంచి నీటి బావిని అభివృద్ధి చేసి భక్తులకు నీటి కొరతను తీర్చేలా కృషి చేస్తున్నారు.స్థంభం చెట్టు చుట్టూ నాణ్యమైన గ్రానైట్ ఫ్లోరింగ్ వేసి చుట్టూ రైలింగ్ చేపడుతున్నారు.
భక్తుల సౌకర్యాల కల్పనకు రూ.90 లక్షలు
స్వామివారి కళ్యాణ మండపం నిర్మాణం, భక్తులకు కేశ ఖండన షెడ్డు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు నిర్మిస్తున్నారు. మౌలిక వసతులకు జాతర ప్రాంగణాన్ని లెవలింగ్ చేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, శుద్ధి చేసిన తాగునీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చారు.
రహదారులకు మెరుగు
భక్తులకు అత్యంత ఉపయుక్తంగా జాతరకు చేరుకునే విధంగా సుమారు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో కీలకమైన రహదారులను నిర్మించడానికి సన్నాహాలు చేపట్టారు.తిరుమలగిరి నుండి జాతర, జగ్గయ్యపేట నుండి జాతర, పాండవుల గుట్ట నుండి జాతర వరకు రోడ్లు నిర్మాణానికి పనులు తల పెట్టారు.
స్థానికుల హర్షం..
ఎమ్మెల్యే సత్యనారాయణ రావు నిజమైన భక్తుడు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన ఈ అద్భుతమైన అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇది కేవలం పనులపై శ్రద్ధ మాత్రమే కాదని,వేలాది మంది భక్తుల మనోభావాలను గౌరవించడమేనని వారు అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి ఊహించలేదు
మా బుగులోని స్వామి జాతర ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతుందని ఊహించలేదు. ఇంతకు ముందు జాతరకు వచ్చేవారికి కనీస సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పుడు మెట్లు వెడల్పు అయ్యాయి. రోడ్లకు పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వామివారి పట్ల నిజమైన భక్తితో ఈ పనులు చేయించారు. ఇది చరిత్రలో నిలిచి పోతుంది.
గంగదారి తిరుపతి, స్థానిక భక్తుడు ఆనందంగా ఉంది
మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు లేక గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మరుగుదొడ్లు,బట్టలు మార్చుకునే గదులు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారంటే ఆనందంగా ఉంది. ఎమ్మెల్యేకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
లక్ష్మి, భక్తురాలు రెండో తిరుపతిగా తీర్చిదిద్దుతా
తెలంగాణలో చాలా అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న కొండలపై స్వయంభుగా వెలసిన శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయం చాలా ప్రసిద్ధమైంది.సుమారు రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రహదారుల నిర్మాణంలో ఫారెస్ట్ అనుమతులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కొంత జాప్యం జరిగింది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.ఎమ్మెల్యే కాకముందే స్వామివారికి పంచలోహ విగ్రహాలు సమర్పించాను. రెండో తిరుపతిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు