calender_icon.png 7 November, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ఖ్యాతిని ప్రపంచానికి చాటాలి

07-11-2025 12:00:00 AM

-సాంఘిక సంక్షేమ జోనల్ అధికారి అరుణకుమారి

-9 పాఠశాలల నుంచి పాల్గొన్న 765 మంది విద్యార్థినులు

-మార్చి ఫాస్ట్, నృత్యాలతో అలరించిన విద్యార్థినిలు 

తుంగతుర్తి, నవంబర్ 6 : క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసీసీబీ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు గురుకులం జోనల్ అధికారి అరుణ కుమారి అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులపాటు జరుగనున్న 11 వ జోనల్  గేమ్స్ అండ్ స్పోరట్స్ మీట్ ను గురువారం ముఖ్య అతిథి జోనల్ అధికారిని అరుణ కుమారి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి..జాతీయ పతకాన్ని ఆవిష్కరించి క్రీడల జ్యోతిని వెలిగించి, గాలిలోకి బెలూన్లను వదిలారు. విద్యార్థినుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య ను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని.. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఏడాదికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు.

రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని కొనియాడారు. క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వివిధ రకాల పోటీల్లో ప్రోత్సహిస్తున్నదన్నారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు మూడు రోజులపాటు పౌష్టికాహారం, పండ్లు, మాంసాహారం అందించడం జరుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలువరని.. ఓటమిని గెలుపుగా స్వీకరించి గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.గురుకులాల ఖ్యాతిని ప్రపంచానికి చాటాలన్నారు.

ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల డిసిఓ జె. శోభారాణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,తహసిల్దార్ దయానందం, సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, ఎస్త్స్ర క్రాంతి కుమార్,ప్రగతిశీల తల్లిదండ్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ నరసయ్య, పాఠశాల కమిటీ అధ్యక్షుడు పోలేపాక రామచంద్రు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండగడుపుల ఎల్లయ్య, వివిధ పాఠశాలల  ప్రిన్సిపల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.