calender_icon.png 11 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాలు మారిన బీసీల తలరాత మారడం లేదు

11-09-2025 12:25:53 AM

  1. ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు చేయాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
  2. ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి

ఆదిలాబాద్/నిర్మల్/కుమ్రం భీం ఆసిఫా బాద్/మంచిర్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఎన్ని ప్రభుత్వాలు మారిన...ఎన్ని పోరాటాలు చేసినా బీసీ కులాలోని ప్రజల బతుకులు మాత్రం మారడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. చాకలి ఐలమ్మ చూపిన తెగువను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద బుధవారం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, రజక సంఘం నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రం వస్తే తమ తలరాతలు మారుతాయని రాష్ట్ర సాధన పోరాటంలో ముందు వరుసలో ఉన్న బీసీలు, ఎన్నో ప్రాణ త్యాగాలు చేశారని, కానీ రాష్ట్రం వచ్చిన బీసీ చేతి వృత్తి కులాలు కష్టాల్లోనే ఉన్నాయని అన్నారు.

వర్ధంతి, జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడం తో పాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ అధ్యక్షుడు  చిక్కాల దత్తు, సంతోష్. వినోద్, భరత్ బీజేపీ నాయకులు ఆదినాథ్, లాలా మున్న, రఘుపతి, సచిన్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేసిన చాకలి ఐలమ్మ జీవిత ఆశయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని బిజెఎల్‌పి నేత మహేశ్వ ర్‌రెడ్డి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు జి నాగేష్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేం ద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం పాలనపై ఆమె చేసిన పోరాటం ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో పార్టీ నాయకులు ఉన్నారు.

మహనీయుల ఆశయాలు కొనసాగిద్దాం

మంచిర్యాల కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలు లో బుధవారం వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరై జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వీరవనిత పోరాటం గురించి మాట్లాడారు. మహ నీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందు కు సాగుదామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలకు ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి, రజక సంఘం, వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి అని, ఐలమ్మ చూపిన ధైర్యం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మను స్మరిస్తూ కమ్యూనిటీ హాల్, చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సజీవ న్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అలీబిన్ అహ్మద్, జిల్లా రజక సంఘం అధ్యక్షులు కడతల మల్లయ్య, సంఘ ప్రతినిధులు కొండపల్లి భూమయ్య, రాజేందర్, బి.సి. సంక్షేమ సంఘం ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.