calender_icon.png 19 December, 2025 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు పోరు

16-12-2025 02:02:15 AM

  1. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
  2. బీసీల డిమాండ్లను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తా
  3. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి
  4. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): చట్టసభలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో దేశ వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. ఈ మేరకు సోమవారం అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో జరిగిన జాతీయస్థాయి ఓబీసీ సెమినార్‌లో ఎంపీ ఆర్ కృష్ణ య్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

దేశంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చట్టసభల్లో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.  కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలనే బీసీ సంఘాల డిమాండ్‌ను ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

దేశంలోని బీసీల అసమానతలు అధిగమించాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయ పరచుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్  పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు జెండాలు పక్కన పెట్టి  చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు  బీసీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు నేతలంతా ఒకే తాటిపైకి కలిసి రావాలని పిలుపునిచ్చారు.

అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓ బీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ కమిషన్ తెలంగాణ మాజీ చైర్మన్ వకులా భరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ బీసీల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, వాటిని సాధించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సెమినార్‌లో అఖిలభారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి డాక్టర్ ఏపనగండ్ల శ్రీనివాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసి బాబు, రాష్ట్ర పదాధికారులు బత్తుల వెంకటేష్, జోడి గణపతి, సీహెచ్. శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి, మనుబర్తి లలిత, అంకమ్మ రమణ కుమారి, ధనలక్ష్మి, గంట లక్ష్మి, జూలీ నాగూర్, బి.రాణి, సంజయ్ కుమార్, కనకం శ్రీనివాసరావులు పాల్గొని ప్రసంగించారు.