17-09-2025 01:58:15 AM
మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): దేశంలోనే మరే వైద్య కళాశాలకు లేని ప్రత్యేకత ఉస్మానియా మెడికల్ కాలేజీ సొంతమని, దానికి అనుబంధంగా ఉన్న 10 ఆసుపత్రులకు పూర్వ వైభవం తీసుకువచ్చి, ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంతో పాటు కర్ణాటక ప్రాంత రోగులకు సైతం ప్రాణం పోసిన ఈ చారిత్రక ఆసుపత్రులను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఉస్మానియా అనుబంధ టీచింగ్ ఆసుపత్రుల పనితీరు, వసతుల కల్పనపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “సాధారణంగా ఏ మెడికల్ కాలేజీకైనా ఒకటి లేదా రెండు అనుబంధ ఆసుపత్రులే ఉంటాయి. కానీ ఉస్మానియాకు ఏకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నీలోఫర్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఎంఎన్‌జే కేన్సర్, ఈఎన్టీ, ఫీవర్ హాస్పిటల్ వంటి 10 ప్రతిష్టాత్మక సంస్థలు అనుబంధంగా ఉన్నాయి. 5 వేలకు పైగా పడకలతో, ఒక్కో ఆసుపత్రి ఒక్కో స్పెషాలిటీలో లక్షల మందికి సేవలందిస్తోంది.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రులకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలి” అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ నరేంద్ర కుమార్, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొని, తమ ఆసుపత్రుల పనితీరు, సమస్యలను మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఆసుపత్రుల ఆధునీకరణకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈలను ఆదేశించారు.
ముఖ్యంగా ఈఎన్టీ ఆసుపత్రి నూతన భవ న నిర్మాణ సమస్యను, ఉస్మానియా డెంటల్ కాలేజీ భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. త్వరలోనే అన్ని ఆసుప త్రులను సందర్శిస్తానని, రోగులకు అందుతున్న సేవలపై నేరుగా వారితోనే మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటానని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.