calender_icon.png 24 November, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు పటేల్ కంటే ఆప్తుడెవరు

24-11-2025 12:07:36 AM

-ఉక్కుమనిషి 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ 

-నివాళులర్పించిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): రజాకార్ల రాక్షస పాలన నుంచి తెలంగాణ గడ్డకు విముక్తి ప్రసాదించి, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభా య్ పటేల్ అని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలవాల్సిన మొట్టమొదటి వ్యక్తి పటేల్ అని, ఆయన లేకుంటే ఈ ప్రాంత చరిత్ర మరోలా ఉండేదని పేర్కొన్నారు.

సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో నిర్వహించిన యూనిటీ మార్చ్‌లో కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీతాఫల్‌మండి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ, చిలకలగూడ గాంధీ విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఆ నాడు గ్రామీణ తెలంగాణలో రజాకార్లు సాగించిన హత్యాకాండ, హిందువులపై జరిగిన దారుణాలు, మహిళలపై జరిగిన అమానవీయ అకృత్యాల నుంచి మనల్ని విముక్తి చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలిపారు.

కేవలం తెలంగాణకు ఆప్తుడే కాకుండా, దేశ నిర్మాణంలో కూడా పటేల్ పాత్ర అపూర్వమైనదని గుర్తుచేశారు.  పటేల్ 150వ జయంతి ఉత్సవాలను తెలంగాణలోని ప్రతి అంగణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం మనందరి బాధ్యత అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు తదితరులు ఉన్నారు.