06-08-2025 12:17:35 AM
-మార్నింగ్ వాక్‌లో చెరువుల పరిశీలనలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు,ఆగస్టు 5 (విజయ క్రాంతి): సమృద్ధి వసతులతో కూడిన నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం మునుగోడు మండలం లోని సోలిపురంలో సమస్యలు తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ చేశారు. కబ్జాలకు గురై న సోలిపురం చెరువును పరిశీలించి మాట్లాడారు. నీరు సకల కోటి ప్రాణాలకు జీవనాధా రమని మనిషి జీవన విధానం చెరువుల చుట్టూ అల్లుకుని ఉందన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో వర్షపు నీటి పైన ఆధారపడి రైతాంగం వ్యవసాయం చేసుకుంటారని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచుకోవడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువులను అభివృద్ధి చేసుకోవలసి ఉందన్నారు. కబ్జాకు గురైన చెరువు భూములను సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోలిపురం వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించిన ఆయన గ్రామాల్లోని చిన్నచిన్న సమస్యలకు ప్రతిసారి పోలీస్ స్టేషన్లకు వెళ్ళొద్దని , గ్రామ పెద్దలందరూ కూర్చొని మాట్లాడి సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
మనం బ్రతకాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బ్రతకాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ జీవన విధానాన్ని కొనసాగించాలన్నారు.. ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం వల్ల సమ యం ఖర్చు వృధా అవుతుందన్నారు. గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా చెరువుల పునర్నిర్మాణ యజ్ఞంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో మునుగోడు మండల నాయకులతోపాటు చండూరు ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు ఇన్చార్జి తహసిల్దార్ నరేష్, ఇంచార్జ్ ఎంపీడీవో విజయ భాస్కర్, పంచాయతీరాజ్ ఏఈ సతీష్ రెడ్డి, సర్వేయర్ నాగేశ్వరరావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులులు, మాజీ ఎంపీపీ అనంత వీణ లింగస్వా మి గౌడ్, మాజీ సర్పంచ్ నకిరేకంటి యాద య్య, మాజీ ఉపసర్పంచ్ పోలగొని ప్రకాష్, తీర్పారి ఆంజనేయులు ఉన్నారు.