calender_icon.png 23 October, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం

23-10-2025 02:04:49 AM

-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ

-సంగారెడ్డిలో పోలీసు హెల్త్ క్యాంపు ప్రారంభం

సంగారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి):సామాన్యుడికి భారం కాకుండా అందరికీ అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదర్ రాజనర్సింహా చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పోలీసులను, వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు.

ప్రభుత్వం సమాజ భాద్యతతో ప్రజల ఆరోగ్యం , విద్య , వైద్యం కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీసు కుటుంబాల కోసం వైద్య శిబిరం నిర్వహించటం చక్కని ఆలోచన అన్నారు. 13 రకాల వైద్య నిపుణులైన డాక్టర్లు ఈ హెల్త్ క్యాంప్ లో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 160 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు మరో 80 కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వెల్లడించారు. త్వరలో 80 ట్రామా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హైవేలపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి గోల్డెన్ అవర్ ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కీమో థెరపీ అందిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా హెల్త్ క్యాంపులో ఏర్పాటు చేసిన అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రముఖ వైద్యులు కిరణ్ కుమార్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజు గౌడ్ , సెక్రటరీ డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీహరి, జిల్లా పోలీస్ అధికారులు , వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. 

ప్రభుత్వం రైతు పక్షపాతి !

ఆందోల్(సంగారెడ్డి), అక్టోబర్ 22(విజయక్రాంతి):రాష్ట్రం ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. బుధవారం అందోల్ మార్కెట్ యార్డ్ లో సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల సంస్థ అద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు.

సంగారెడ్డి జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థల ( ఎఫ్ పి ఓ) ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వస్తే అవకాశం కల్పించి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్ కృషితో సింగూర్ కాల్వ ఇవ్వడం వల్ల 40 వేల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అందోల్ ఆర్డీవో పాండు, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ శేరి జగన్ మెహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు సురేందర్ గౌడ్, చిట్టిబాబు, కళాలి రమేష్ గౌడ్, పిఎసిఎస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.