26-11-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ నవంబర్ 25 (విజయక్రాంతి) / కల్వకుర్తి / కొల్లాపూర్ రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, రాష్ట్రం, దేశం అన్నీ అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో 2399 మంది మహిళా స్వయం సహాయక సంఘం మహిళలకు 2.64 కోట్లు వడ్డీ లేని రుణాలతో పాటు చీరలను పంపిణీ చేశారు.
కల్వకుర్తిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్ కల్వకుర్తి పట్టణంలో మండల మహిళా సంఘాల సభ్యులకు రూ,1.27 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ చేశారు. వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహక చర్యలు అమలు చేస్తున్నామన్నారు.
స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం మరింతగా కృషి చేస్తోందని, ఇందిరమ్మ చీరలు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తూ మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కలెక్టర్ బాదావత్ సంతోష్ చేతుల మీదుగా స్వయం సహాయక సంఘం మహిళలకు 1.70 కోట్లు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు.
వేరు వేరు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఆర్డిఓ పిడి చిన్న ఓబులేసు, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, ఎమ్మార్వో ఇబ్రహీం, ఎంపీడీవో వెంకట రాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్కుమార్ రెడ్డి, కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్, నాయకులు భూపతిరెడ్డి, అశోక్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ పాలనలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు..
వనపర్తి, నవంబర్ 25 (విజయక్రాంతి ): ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడమే కాకుండా అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకే ఇచ్చి మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా ఇందిరమ్మ పాలనలో మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే కాకుండా వారి కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా అన్నారు.
మంగళవారం పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాలకు సంబంధించిన ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని పెబ్బేరు మండలం వల్లపు రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించగా శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి మొదటి సంతకం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పై పెట్టడం జరిగిందన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకే ఇస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, పాఠశాలలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే ఇవ్వడం జరిగిందన్నారు. వనపర్తి జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 3.12 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని అందులో వనపర్తి నియోజకవర్గానికి రూ. 1,24,95,000 లు మహిళల ఖాతాల్లో జమచేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మహిళా సంఘాలకు రూ. 3.12 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు అందజేత
ఇంతకు ముందు ఈ సంవత్సరంలోనే వనపర్తి జిల్లాకు 20 కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని, ఇప్పుడు ఏప్రిల్ 2025 నుండి జూలై 2025 వరకు 3 నెలలకు 3.12 కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు.
ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహం ప్రారంభోత్సవం
పెబ్బేరు మండలంలో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ. 3.00 కోట్ల నిధులతో నిర్మించిన వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని మంగళ వారం వనపర్తి శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభో త్సవం చేశారు. పిడి డిఆర్డిఓ ఉమాదేవి, బి.సి. సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్, అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ పెబ్బేరు తహసిల్దార్ మురళి, శ్రీరంగాపూర్ తహసిల్దార్ రాజు, ఎంపీడీఓ వెంకటేష్, మార్కెట్ కమిటి చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య చైర్మన్ స్వరూప, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు శ్రీలత, పద్మమ్మ, అక్కమ్మ, మహిళా సంఘాల సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా రుణాలు సద్వినియోగం చేసుకోవాలి.
గద్వాల, నవంబర్ 25 : ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఫలితంగా మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఐడిఓసి లోని సమావేశపు మందిరంలో సేర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అట్టహాసంగా జరిగిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలికి గుర్తింపు, గౌరవం ఉండాలని ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో వ్యాపారాలు చేసుకుంటూ, వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేస్తూ కుటుంబ అవసరాలకు వినియోగిస్తుండ డంతో కుటుంబ నిర్వహణలో మహిళలు కీలక శక్తిగా ఎదుగుతున్నారని కొనియాడారు.
అనంతరం గద్వాల నియోజకవర్గ వర్గానికి సంబంధించి 2248 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు రూ.2.28 కోట్ల విలువైన చెక్కును ఎమ్మెల్యే కలెక్టర్ తో కలిసి ఆయా మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ఏపీడి శ్రీనివాసులు, డిపిఎం లు సలోమి, అరుణ, ఆయా మండలాల మహిళ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.