calender_icon.png 22 November, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

22-11-2025 01:22:49 AM

కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట నవంబర్ 21: ఎస్‌ఎల్బిసి నిర్మాణంలో భాగంగా నక్కల గండి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ స్పష్టం చేశారు. శుక్రవారం నక్కలగండి ప్రాజెక్టు ముంపు ప్రభావానికి గురయ్యే నక్కలగండి తండా, మర్లపాడు తండా, కేశ్య తండా, మన్నేవారిపల్లి గ్రామాల ప్రజలతో మాట్లాడారు. పునరావాసం పునర్నిర్మాణం ప్రక్రియను ముంపు ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి అక్కడి ప్రజలతో సమావేశమై వారి అవసరాలు, అభిప్రాయాలు, పునరావాసంపై ఉన్న సందేహాలను తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ ప్రాంతానికి వచ్చి ముంపు ప్రభావం, పునరావాస పనులు, పంట నష్టాలను పరిశీలిస్తున్నామన్నారు. 

పునరావాస కాలనీలు కేవలం ఇండ్ల నిర్మాణం మాత్రమే కాకుండా, నీటి సౌకర్యం, విద్యుత్, అంతర్గత రహదారులు, డ్రెయినేజ్ వ్యవస్థ, స్ట్రీట్ లైటింగ్, కమ్యూనిటీ హాల్స్ వంటి అన్ని మౌలిక వసతులతో రూపుదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.   వ్యక్తిగత వ్యాపారాలు, చిన్న వ్యాపారాల వల్ల నష్టపోయిన వారు కూడా స్వయంగా వచ్చి తమ సమస్యలను వివరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీవో మాధవి, అచ్చంపేట తాహసిల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు ఆయా ముంపు గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు.