06-10-2025 12:00:00 AM
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
--చంద్రశేఖర్ కుటుంబీకులను పరామర్శించిన మంత్రి
ఎల్బీనగర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): అమెరికాలోని డల్లాస్ నగరంలో గుర్తు తెలియని దుండుగుల కాల్పుల ఘటనలో మృతి చెందిన హైదరాబాద్ నివాసి పోలే చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. ఆదివారం రాత్రి మంత్రి లక్ష్మణ్‌కుమార్ ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని బీఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న మృతుడి నివాసానికి వచ్చి చంద్రశేఖర్ కుటుంబీకులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వచ్చానని, మీకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం చేస్తామన్నారు. చంద్రశేఖర్ భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తెచ్చేందుకు ఇప్పటికే చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.
రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అమెరికాలో ఉండి, అక్కడి విదేశాంగ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నార, త్వరగా చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేలా కృషి చేస్తున్నారని వివరించారు.మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టాలని, త్వరగా చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తెప్పించాలని కోరారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్ వెంట కాంగ్రెస్ నాయకుడు శశిధర్ రెడ్డి, గణేశ్ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ శివ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.