26-11-2025 12:00:00 AM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్‌లో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి దత్తరావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మహిళకు చీర అందించే లక్ష్యంతో లక్ష 11 వేల చీరలు పంపిణీకి సిద్ధమైనట్లు తెలిపారు.
రెండు రోజుల్లో చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మహిళా శక్తి ఎంతో గొప్పదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక ఎదుగుదల కోసం పెట్రోల్ బంకు, ఆర్టీసీ బస్సు, క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటు, వడ్డీ లేని రుణాలు లాంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో నిర్ణయాధికారం ఉండే మహిళలను సిద్ధం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు .
మూడు విడతల్లో ఆరు కోట్ల రూపాయలు వడ్డీ లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయగా, మూడో విడతలో రెండు కోట్ల 70 లక్షల రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సమైక్య భవనం కూడా నిర్మాణ దశలో ఉందని త్వరలోనే పూర్తయి అందుబాటులోకి వస్తుంద న్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాల తిరిగి చెల్లింపులు ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లాలో 98 శాతం తిరిగి చెల్లింపు జరగడమే దీనికి నిదర్శనం అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు వృధా చేయకుండా ఉపయోగించుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘా లలో 16 నుండి 18 సంవత్సరాల కిశోర బాలికలను కూడా చేర్చుకోవడానికి తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదన్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ తో పాటు, రెండు కోట్ల 70 లక్షల విలువ గల వడ్డీ లేని రుణాలు చెక్కు, 26 కోట్ల 53 లక్షల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, గౌరవాధ్యక్షురాలు శ్రీదేవి, డిపిఎం యాదగిరి ఇతర సిబ్బంది లబ్ధిదారులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.