17-06-2024 12:00:00 AM
గన్నమరాజు గిరిజా మనోహర బాబు :
“క్వచిదర్థః క్వదిచ్ఛబ్దః
క్వచిద్భావః క్వచిద్ర సః
యత్రైతే సర్వే పి
స నిబంధే నలభ్యతే॥”
అంటూ ‘మనోజ్ఞమైన కావ్యం ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని’ తన ‘మధురా విజయం’ అనే కావ్యంలో చెప్పుకున్న మహా కవియిత్రి గంగాదేవి. ఆమె సంస్కృత భాషలో రచించిన ఈ మహా కావ్యానికి ‘వీర కంపరాయ చరిత్ర’ అనే నామాంతరం కూడా ఉంది. 14వ శతాబ్దానికి చెందిన కవయిత్రి గంగాదేవి నాటి పాలకులైన కాకతీయుల ఆడబిడ్డ. ఆమె విజయనగర సామ్రాజ్యానికి కోడలుగా వెళ్లిన రాజ కుటుంబీకురాలు. ఓరుగల్లులో సుప్రసిద్ధ మహాకవి, ‘బాలభారతం’ వంటి అనేక రచనలు చేసిన అగస్త్యుని మేనల్లుడు, ‘సౌగంధికాపహరణ’ కర్తయైన విశ్వనాథుని శిష్యురాలు. అపారమైన సంస్కృత భాషా పటిమ కలిగిన కవయిత్రిగా ఈ ‘మధురా విజయమ’నే తొమ్మిది సర్గల మహాకావ్యాన్ని సంస్కృత భాషా ప్రేమికులకు అందించింది.
‘కావ్యం ఇవ్వలేనిదంటూ ఏదీ లేదన్న’ తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ
“కరోతి కీర్తి మర్థాయ
కల్పతే హంతి దుష్కృతమ్
ఉన్మీలయతి చాహ్లాదమ్
కిం సూతే కవే: కృతిః॥”
‘కావ్యం కీర్తినిస్తుంది, ధనాన్నిస్తుంది, పాపాలను పోగొడుతుంది, ఆనందం కలిగిస్తుంది’ అని స్పష్టంగా చెప్పుకున్నది కవయిత్రి.
తెలంగాణ తొలి సంస్కృత కవయిత్రి
విజయనగర సామ్రాజ్యాధిపతిగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న బుక్కరాయల కుమారుడే కంపరాయలు. అనేక శాసనాధారాలతో వీరి కాలం 14వ శతాబ్దంగానే నిర్ణయించారు చరిత్రకారులు. కంపరాయల భార్యగా గంగాదేవి విజయనగరపు కోడలుగా విజయనగరానికి వెళ్లింది. అప్పటికి యువరాజైన కంపరాయలు తండ్రి ఆదేశం మేరకు మధుర సుల్తానుపై దండయాత్రకు బయలుదేరడం, అంతకు పూర్వం తుండీర మండలం, విరించిపురం, పాలేరులను స్వాధీన పరచుకొని ఆటవిక రాజైన చంపరాజును జయించడం వంటి ఎన్నో చారిత్రకాంశాలను గంగాదేవి ఒక చారిత్రక సంస్కృత కృతి ‘మధురా విజయం’ తెలియజేస్తున్నది. తెలంగాణ ప్రాంతపు తొలి సంస్కృత కవయిత్రి అయిన గంగాదేవి రచించిన ఈ కావ్యంలో తెలుగు ప్రబంధాల ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది.
కాకతీయుల ఆడబిడ్డ
ఈ మహాకవయిత్రి కవిత్వం గురించి పలువురు సాహితీవేత్తలు తమతమ వ్యాసాల్లో అనేక విధాలుగా ప్రస్తుతించారు. కాని, సాహిత్య చరిత్రకారులు మాత్రం గంగాదేవి సంగతులు తమ సాహిత్య చరిత్రల్లో అంతగా రాయలేదనే చెప్పాలి. అయితే, 2022లో ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ వారు ప్రచురించిన ‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’లో మాత్రం సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు, ప్రముఖ సాహితీ వేత్త సంగనభట్ల నర్సయ్య అనేక విశేషాలను అందించారు.
“హరిహర రాయల అనంతరం బుక్కరాయలు 1355లో విజయనగర సామ్రాజ్యాధీశునిగా పట్టాభిషిక్తుడు అయినట్లు, ఆయన మూడవ కుమారుడైన కంపరాయల దేవేరియే కాకతీయుల ఆడబిడ్డ గంగాదేవి” అని ఆయన పేర్కొన్నారు. ఆమె విరచితమైన ‘మధురా విజయ’ విశేషాలను విపులంగా వివరించారు. ఆమె గురువైన విశ్వనాథుని గురించిన వివరాలతోపాటు వీరకంపరాయల పట్టాభిషేకం, మరణం, మధుర సుల్తాన్‌పై యుద్ధం మొదలైన అంశాలనూ శాసన ప్రమాణాలతో నర్సయ్య విపులీకరించారు. గంగాదేవి పేర్కొన్న కావ్యగత అంశాలతోసహా శాసనాలలోని కొన్ని అంశాలను గురించి కూడా ఆయన పేర్కొన్నారు.
‘మధుర విజయం’లో మధురమైన కవిత్వం
‘మధుర విజయం’లోని మధురమైన కవిత్వాన్ని గురించికూడా కొందరు పెద్దలు పలు విధాల ప్రశంసలు కురిపించారు. విశ్వనాథ వారు గంగాదేవి కవిత్వ ప్రతిభను గురించి వెల్లడిస్తూ, “కాళిదాసుని యుపమా గౌరవము, భారవి మాఘాదుల యర్థగౌరవ శ్లేషసంఘటనా వైచిత్య్రాదులు, భట్టబాణుని యపూర్వ కల్పనా చమత్కారాలు, బిల్హణుని రీతి మాధుర్యాదులు, ఆంధ్రకవుల యక్షర రమ్యతా స్ఫూర్త్యాదులు, నిండు బహుళముగా గానవచ్చును..” అని ఎంతో విపులంగా పేర్కొన్నారు. మహాకవుల కావ్యాలలోని శక్తిని గంగాదేవి కవిత్వంలో ఏ విధంగా నిక్షిప్తం చేశారో ఆయన వివరించారు. అదే విధంగా ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త నేలటూరి వేంకట రమణయ్య “ఈ కావ్యము కాళిదాసుని రఘువంశమును బోలి మధురమగు శైలిలో నలరారుచున్నది” అంటూ కవయిత్రి ప్రతిభను, కావ్య ప్రశస్తిని వివరించారు.
పలువురు వ్యాసకర్తలు కూడా ఈ కవయిత్రి ప్రతిభను వివరించారు. శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ “తెలుగునాట ఎఱ్ఱాప్రగడ, నాచన సోమనాథుడు, రావిపాటి త్రిపురాంతకుడు, కాటయ వేమారెడ్డి, రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుడు, కుమారగిరి వసంతరాయలు అను కవులు ఈమెకు సమకాలికులు కావచ్చు” అంటూ ఆమె కాలాన్ని వివరించారు. “రాజవంశ సంభూతయై, పట్టమహిషియై, సారస్వత వ్యాసంగమున దవిలి యుండుటే అరుదు. అందును చతుర కావ్య నిర్మాణము చేయగలిగిన ప్రజ్ఞావతి యగుట ఇంకను నబ్బురము” అని ప్రశంసించడం కవయిత్రి ప్రతిభకు దర్పణం పడుతున్నది.
తెలుగుపై ఎనలేని అభిమానం
గంగాదేవి కావ్య మర్యాదానుసారంగా ప్రారంభంలో పూర్వకవుల స్తుతి చేసింది. వాల్మీకి, వ్యాస, కాళిదాస, భవభూతి, భారవి వంటి సంస్కృత కవుల సరసన తెలుగు కవి కవిత్రయంలో ఒకడైన తిక్కన మహాకవిని గూడా స్తుతించి, తన తెలుగు అభిమానాన్ని చాటుకున్నది. తన గురువైన విశ్వనాథుని కృపాకటాక్షం వల్ల సంస్కృత సాహిత్యాన్నేగాక తెలుగు సాహిత్యాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన గంగాదేవి ముందుగా ఆదికవి వాల్మీకిని స్తుతిస్తూ,
“చేతసో స్తు ప్రసాదాయ, సతాం ప్రా చేతసో మునిః
పృథివ్యాం పద్య నిర్మాణ విద్యయా ప్రథమం పదమ్॥”
అని ప్రశంసించిన శ్లోకంలో వాల్మీకి మహర్షి, ఈ లోకంలో పద్యవిద్యా నిర్మాణంలో తొలి అడుగు వేసిన వానిగా కీర్తించింది. ఇందులో ‘పద్యవిద్య’ అనే మాట తెలుగులో ఆదికవిగా భావిస్తున్న నన్నయ భట్టు ప్రయోగం స్ఫురిస్తుంది. నన్నయ కూడా వాల్మీకి మహర్షిని స్తుతిస్తూ, ‘గురు పద్యవిద్యకు నాద్యుని’గా పేర్కొన్నాడు. బహుశా గంగాదేవి అంతరంగంలో ఈ ‘పదం’ పాదుకొని ఉండవచ్చు. సరిగ్గా వాల్మీకి స్తుతిలోనే ఇది ప్రయోగింపబడింది.
తిక్కన మహాకవి స్తుతి ఎంతో కవితాత్మకంగా చేసింది ఈ కవయిత్రి.
“తిక్కయస్య కవేస్సూక్తి: కౌముదీవ కలానిధేః
సతృష్ణు కవిభిస్తురైం చకోరైరివ సేవ్యతే ॥”
అంటూ మనోహరమైన భావంతో అలంకారిక రీతిలో ఈ కవిబ్రహ్మను స్తుతించింది. ‘చంద్రుని వెన్నెలను చకోరములు గ్రోలినంత ఆనందంగా తిక్కన మహాకవి సూక్తిని కవులు గ్రోలుతుంటారని’ చెప్పడంలో ఒక సౌందర్యం, గౌరవం ద్యోతకమవుతున్నాయి. చంద్రునికి వున్న ‘కళానిధి’ అనే పేరును ఉపయోగించుకొని ‘కలా నిధేః’ అనే శబ్ద ప్రయోగం చేయడం వెనుక తిక్కనయే తన ‘నిర్వచనోత్తర రామాయణం’లో చెప్పుకున్న, “అమలో దాత్తమనీష..” పద్యంలో ప్రయోగించిన ‘కళా విదుడ’ అనే శబ్దం స్ఫురించేదేమో. తెలుగు కవులపై అభిమానం వున్న తెలుగింటి ఆడబిడ్డ సంస్కృత కావ్యం రచించినా తెలుగు కవుల ప్రభావం రాక మానదు కదా!
సమకాలీన సమాజ చిత్రణ
తొమ్మిది అధ్యాయాలున్న ఈ కావ్యంలో అనేక అలంకారాలు, ఛందో వైవిధ్యం, విశేష శబ్ద ప్రయోగ బాహుళ్యం, వర్ణనా చాతుర్యం, ఊహా శాలిత్వం పుష్కలంగా దర్శనమిస్తాయి. కంపరాయల వీరత్వాన్ని ప్రత్యక్షంగా చూసిన గంగాదేవి వర్ణనల్లో ఆయన యుద్ధ కుశలతను, ధీరోదాత్త వ్యక్తిత్వాన్ని విస్తృతంగా వర్ణించింది. ప్రకృతి వర్ణన, సమకాలీన సమాజ చిత్రణ, నాటి మహమ్మదీయ రాజులు స్థానికులైన హిందువులపై జరిపిన అనేక దుష్కృత్యాలు కూడా ఈ కావ్యంలో చోటు చేసుకోవడం విశేషం.
మానవ జీవితం ఒక్కొక్కసారి దు:ఖమయం కావడానికి అతనిలోని అహంకారమే కారణమవుతుంది. యౌవన కాలంలో తనను తాను నిగ్రహించుకొని తన జీవితాన్ని మనిషి సరిదిద్దుకోవాలి. యౌవనం మానవునిలో అహంకారాన్ని పెంచుతుంది. ఆ విషయాన్నే కవయిత్రి
“భవత్యహంకార మహీరుహాంకుర
దమా పయశ్శోషణ దారుణోష్మణీ
తమః ప్రదోషే తరుణి మ్ని కస్య వా
సమంజసం వశ్యతి దృష్టి రంజసా॥”
‘యౌవనం అహంకారమనే వృక్షానికి అంకురమై, దయ అనే జలాన్ని అడుగంట జేయు దారుణమైన గ్రీష్మమై, అంధకారానికి మూలమైన రాత్రియై ఎవని దృష్టినీ న్యాయం వైపు మళ్లనీయదు’ అంటూ ‘యౌవనం మనిషిలో అహంకారం పెంచుతుందని, దయాగుణాన్ని చంపేస్తుందని’ స్పష్టంగా చెప్పింది. వీటిని గుర్తుంచుకొని ప్రతి మనిషి తనను తాను సరిదిద్దుకోవాలన్నది సారాంశం.
తెలుగు వారు గర్వించే విధంగా ఒక మహాకావ్యాన్ని నిర్మించిన గంగాదేవి ప్రతిభ అనన్య సామాన్యం. ఓరుగల్లు రాజకూతురు, విజయనగర సామ్రాజ్యపు కోడలుగా, వీరపత్నిగా కీర్తిని అందడంతోపాటు నాటి చరిత్రను, కంపరాయల వీరత్వాన్ని కావ్యబద్ధం చేసి శాశ్వతం చేసిన మహావిదుషిగా చిరకీర్తిని సాధించి, సంస్కృత సాహితీ ప్రపంచంలో గంగాదేవి తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించిందని ఘంటాపథంగా చెప్పవచ్చు.
వ్యాసకర్త సెల్: 9949013448
ఆమె హృదయ వేదన
వీర కంపరాయలు మధురపై దండయాత్రకు పోవడానికి ప్రధాన కారణం అక్కడి మహమ్మదీయ రాజులు ప్రజలను పెడుతున్న కష్టాలే అన్నది ఒకటైతే, బుక్కరాయలు ప్రజా సంక్షేమ పూర్వక రాజ్యాన్ని విస్తరింప జెయ్యాలన్నది కూడా మరో కారణం. అందుకే యువరాజు, తన కుమారుడైన వీర కంపరాయలను యుద్ధానికి పంపాడు.
గంగాదేవి ‘మధురా విజయ’ కావ్యంలోని ఎనిమిదవ సర్గలో, మధుర సుల్తాన్ రాజ్యంలో సుల్తాన్ అరాచకాలను ప్రజాకంటక పాలనను చిత్రించి నాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టించింది. మహమ్మదీయ పాలకుడు తన సైన్యంతో చేయించిన దేవాలయాల విధ్వంసం స్వయంగా చూసిన గంగాదేవి హృదయం ఎంత పరివేదన చెందిందో తెలియజేసే రీతిలోని శ్లోకాల్లో ఒకటైన
“ముఖరాణి పురా మృదంగ ఘోషైః
అభితో దేవకులాని యాన్యభూషన్
తుములాని భవంతి ఫేరవాణాం
నినదైస్తాని భయంకరై రిదానీమ్॥”
అన్న శ్లోకం మనకు దృశ్యమానం చేస్తున్నది. ‘ఒక రోజుల్లో మద్దెల వంటి సంగీత వాద్యాలతో మార్మోగిన ఇక్కడి దేవాలయాలు, ఈనాడు భయంకరమైన నక్కల కూతలతో ప్రతిధ్వనించడం బాధాకరం’ అని వర్ణించిన వర్ణననుబట్టి, ఆ రాజుల దౌష్ట్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.