17-06-2024 12:00:00 AM
కోవెల సుప్రసన్నాచార్య :
1971లో కల్పవృక్షానికి జ్ఞానపీఠ బహుమానం వస్తే, ఎనభైల చివర్లో నారాయణరెడ్డి వచన కవిత్వ మహాకావ్యం ‘విశ్వంభర’కు ఆ గౌరవం దక్కింది. శేషేంద్ర ‘నా దేశం నా ప్రజలు’ వచన కవిత్వం సాధించుకున్న ఒక ఇతిహాసం. పైన పేర్కొన్న మానవీయం, నా దేశం నా ప్రజలు, విశ్వంభర అన్నీ మానుష ఇతివృత్తము ప్రధానమైన రచనలు కావు. భావ ప్రస్తారంలో, విచారణ శీలంతో సాగిపోయే కావ్యాలు.
గడచిన ముప్పయేళ్లలో తెలుగు సాహిత్యంలో ప్రస్ఫుటమైన అంశాలు దళితవాద, స్త్రీవాదాలు. దళితవాదం బలంగా అభివ్యక్తం కావటం సుధాకర్ వంటి వారి రచనల్లో చూడవచ్చు. బన్న అయిలయ్య నిప్పుకణిక ఆంతరిక వేదనకు విశ్వరూపం యిచ్చింది. ‘శిఖామణి’ కవితలో దళితవాద పరిమితులకు అతీతంగా అనుభూతి సాంద్రమైన కవితా సుగంధం ప్రకటితమయింది. ముఖ్యంగా ఈ వాదంలో ఎన్నో నవలలు వచ్చాయి. నవలల్లో ఇతః పూర్వం సాహిత్యం ప్రకటించని అనుభవ ప్రపంచం ఆవిష్కృతం అయింది.
అట్లాగే స్త్రీవాదము. సమాజంలో కప్పి వేయబడ్డ బ్రతుకు కోణం. అరవైలలో స్త్రీ నవలా రచయిత్రుల పరంపర రచన సాగించినా అప్పుడు ప్రకటితమయింది కొత్తగా నాగరీకరణం పొందిన, ఆర్థిక స్వాతంత్య్రం పొందుతూ వున్న ప్రేమ, స్వేచ్ఛ, సుఖ జీవనము కలగలపైన కలల ప్రపంచమే వాటిల్లో వ్యక్తమయింది. వర్ణాంతర వివాహాలు, ప్రేమ వైఫల్యాలు, ప్రధాన వస్తువే అయినా ఒక అశావహ స్వప్నమే ప్రధాన భూమిక. సులోచనారాణి, ఆనందారామం మొదలైన వాళ్లు ఈ మెట్లు కట్టిన వాళ్లు. అయితే రంగనాయకమ్మ నవలలు ఇంకా తీవ్రమైన సంవేదనలకు ప్రకటన స్థానాలయినవి.
మరొక మరపురాని నవలాకర్త చివుకుల పురుషోత్తం. ఇతని రచనల్లో మూడవ పురుషార్థం ప్రాచ్య పాశ్చాత్య జీవన ధోరణులు -ముఖ్యంగా వివాహ వ్యవస్థ, కామము. ఈ రెండంశాలను విస్పష్టంగా చర్చకు పెట్టింది. మత తాంత్రిక విషయాలు రహస్య సాధనలు గ్రహించి మరింత విపులంగా చిత్రించారు. ముదిగొండ శివప్రసాద్ నవలల్లో చరిత్ర ఆత్మీయంగా వెలికి వచ్చింది.
కవిత్వ విషయం వస్తే వచన కవిత్వం మరింత బలపడే ప్రయత్నం చేసింది. ఖండకావ్యాల స్థానంలోకి దీర్ఘకావ్యాలు ప్రవేశించాయి. ఈ ప్రయత్నం మాదిరాజు రంగారావు ‘మానవీయం’లో ప్రారంభమయింది. స్వాతంత్య్రోద్యమ శకంలోకి ఖండకావ్యం నవ్య సంప్రదాయమై మహాకావ్యంగా రూపొందిన విధంగానే వచన పద్యమూ ఆ పరిణామాన్ని పొందింది. కుందుర్తి ఆశించిన కథాకావ్యం రావాలని, అయితే పరిణామంలో అది విఫలమయింది. శీలా వీర్రాజు ‘హృదయం దొరికింది’లో ఆ ప్రయత్నం చేసినా అది ఎవరినీ ఆకర్షించలేదు. 1971లో కల్పవృక్షానికి జ్ఞానపీఠ బహుమానం వస్తే, ఎనభైల చివర్లో నారాయణరెడ్డి వచన కవిత్వ మహాకావ్యం ‘విశ్వంభర’కు ఆ గౌరవం దక్కింది. శేషేంద్ర ‘నాదేశం నా ప్రజలు’ వచన కవిత్వం సాధించుకున్న ఒక ఇతిహాసం. పైన పేర్కొన్న మానవీయం, నా దేశం నా ప్రజలు, విశ్వంభర అన్నీ మానుష ఇతివృత్తము ప్రధానమైన రచనలు కావు. భావ ప్రస్తారంలో, విచారణ శీలంతో సాగిపోయే కావ్యాలు.
కథా విస్తృతివల్ల రస స్ఫురణ ఉంటుంది. స్వాయక్తీకరణం ఉంటుంది. ఆర్ద్రత ఉంటుంది. భావానుసంకలనం వలన, వైచారికత వలన బుద్ధి అంతర్ముఖం అవుతుంది. ఆలోచనా శీలం అవుతుంది. తాత్త్విక ధారలో సంలీనం అవుతుంది. పెన్నా శివరామకృష్ణ ‘జీవనది’ గానీ, శివారెడ్డి ‘ఆసుపత్రి గీతం’ కానీ, నగ్నముని ‘కొయ్యగుర్రం’ కానీ వచన కవిత్వంలో వచ్చిన గొప్ప కావ్యాలే. నేను రచించిన ‘సాంపరాయం’ మానవుని ఆద్యంతమూ మృత్యువును ముడివేసిన తాత్త్విక గాథ. వచన పద్యం తెచ్చుకున్న మహాకావ్యం. భావుకత స్థానంలోనికి మానవ జీవన వికాస వ్యుత్పన్నత వచ్చి చేరింది.
వచన కవిత్వం ఒక నిర్దుష్ట విధానాన్ని ఏర్పరచుకోలేకపోయింది. వచనానికి, వచన పద్యానికి నడుమ సరిహద్దు రేఖలు కుంచించుకుపోయాయి. చేరా, సంపత్కుమారల వివాదం వల్ల వచన పద్యానికి లక్షణం ఏర్పడనే లేదు.
ఇదిలా ఉండగా, స్వాతంత్య్రోద్యమాన్ని ఇతివృత్తంగా ముదిగొండ వీరభద్రమూర్తి ‘వందేమాతరం’ కావ్యం వెలువడింది. పద్యమైనా హృద్యంగా అనవద్యంగా సాగిపోయింది. వర్తమానం ఇతిహాసమైంది. వేమూరి వేంకట రామనాథం స్వాతంత్య్ర సిద్ధి మరొక పద్య విద్యా విజయమే.
మరొక పార్శ్వం అనుభూతి కవిత్వం. ఈ అంచులో ముఖ్యమైన కవి ‘ఇస్మాయిల్’ సున్నితంగా చిన్ని చిన్ని ప్రతీకల ద్వారా కావ్య చేతనలోకి ప్రవేశింపజేయటం ఈయన రీతి. వచన ప్రాయమై, వాచ్యమై, పలుచబడిపోతున్న దశలో కవిత్వాన్ని ప్రౌఢీకరించిన ఘనత ఇస్మాయిల్‌ది. ‘ధరను చొచ్చి, దీవిని విచ్చి విరులు తాల్చు తరువు’ అని కవిత్వం స్వభావాన్ని ప్రకాశింపజేశాడు. శ్రీకాంతశర్మ ‘సుపర్ణ’ కూడా ఇంత బలమైన కావ్యమే.
ఈ మధ్య తన్ను తాను చీల్చుకుని సుకుమారమైన అభివ్యక్తిలో అంతర్జగద్వృత్తాన్ని ప్రకటించిన కవి భూమయ్య. ‘ఇది కనకు మరియు వినకుమెప్పుడిది తినకుమని చెప్పగా వినుచు చివరకిట్టులైతి ఇంద్రియ భూములెండిపోయి’ అని శుష్క వైరాగ్య సాధనలో జీవిత సారాన్ని కోల్పోయిన సన్నివేశం చెప్పాడు. దర్భశయనం నదులు, ప్రవాహాలు గ్రామీణ వాతావరణంలోని ప్రతీకలకు ఆధారంగా కొత్త పలుకుబడిని సృష్టించుకోగా, రామా చంద్రమౌళి నగర సంక్లిష్ట జీవన ప్రతీకల సమూహంలో నుంచి తన అభివ్యక్తిని సాధించుకొంటాడు. జూకంటి జగన్నాథం శిథిలమౌతున్న తెలంగాణా ప్రాణనాడిని స్ఫురింపజేస్తాడు.
ఇటీవలి తెలుగు సాహిత్యాన్ని చూస్తే రాజకీయ పక్షాల ఒత్తిడి తగ్గినట్లుగా స్పష్టం అవుతున్నది. స్త్రీవాద దళిత వాదాలు కొంచెం కొంచెం తీవ్రత తగ్గినాయి. ఒక విస్తృత దృశ్యంగా చూస్తే అది బహుముఖము, సంకీర్ణము, పరస్పర సంకలితము, పరస్పర ప్రభావకము అయి గోచరిస్తున్నది.
వైరుధ్యం తగ్గి వైవిధ్యాలు ఆహ్వానించే లక్షణం గోచరిస్తున్నది. అనేక వాదాలు, ధోరణులు, అభివ్యక్తి మార్గాలు పరస్పర సహజీవనం చేస్తున్నాయి. అయితే, కొంచెం సూక్ష్మంగా చూస్తే ఏ ధోరణకి ఆ ధోరణికి పాఠకులు విడివిడిగా ఉన్నట్లు కనబడుతున్నది. ఇతఃపూర్వం (కనీసం పాతిక సంవత్సరాల ముందరిదాకా) కవిత్వం స్పృశించని అనుభవ ప్రపంచాలు దానిలోకి ప్రవేశిస్తున్నాయి. కొత్త ప్రక్రియలు హైకూలు, నానీలు రూపుదిద్దుకున్నాయి.
అన్నింటికీ మూలాధారం రసానుభవం. ఈ కాలంలో ప్రకటితమయిన తుమ్మపూడి వారి కుమారభారతి రహస్య వాద కావ్య ధోరణిలో ప్రౌఢంగా ప్రవేశించింది. విమర్శ మార్గంలో కొత్త ప్రమాదాలు నెలకొల్పే ప్రయత్నం జరిగింది. జి.వి.ఎస్, చేరా, సంపత్కుమార, ఆద్దేపల్లి మొదలైన వాళ్ల కృషి పేర్కొనదగింది. సీతారాం, వంశీకృష్ణ అంతర్జగత్తులో ఉన్న దుఃఖాన్ని కవిత్వంలోకి ప్రవహింపజేశారు. సమాజంలో సంస్కరణలు అతీతంగా అంతస్సులో నెలకొని ఉన్న ఎగుడు దిగుళ్లు ఈనాటి కావ్యాలు, కథలు ప్రతిబింబిస్తున్నాయి. ఇంత కల్లోలంలోనూ చిక్కని కవిత్వం విన్నకోట రవిశంకర్, ఇంద్రగంటి భానుమూర్తి, అఫ్సర్, గౌరీ శంకర్ రచనల్లో గోచరిస్తున్నది.
రచనా కాలం: 9 జనవరి, 2006