27-12-2025 02:31:09 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయా ల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని నూతన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసు లో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఆరా సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ప్రధానంగా రాజకీయ నేత లు, వ్యూహకర్తల ఫోన్లను ట్యాప్ చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో పోలీసులు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అనుమతులు తీసుకున్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది.
2020 నుంచే నిఘా
ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నిర్ధారించుకునేందుకు సిట్ అధికారులు ఆరా మస్తాన్‌ను రెండోసారి విచార ణకు పిలిచారు. గతంలో మస్తాన్ ఇచ్చిన స్టేట్మెంట్‌ను, ప్రభాకర్ రావు చెప్పిన వివరాలతో అధికారులు క్రాస్ చెక్ చేశారు. విచార ణలో భాగంగా సిట్ అధికారులు ట్యాపింగ్ డేటాను మస్తాన్ ముందు ఉంచగా, 2020 నుంచే తన రెండు ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆయన గుర్తించారు.
తన కాల్ డేటా రికార్డులను చూసి ఆరా మస్తాన్ విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయం లో, ఆయన సోదరుడు కొండల్ రెడ్డితో ఆరా మస్తాన్ జరిపిన సంభాషణలే లక్ష్యంగా ఈ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ వంటి కీలక నేతల ఫోన్లను నిఘా నీడలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, ఒక రాజకీయ విశ్లేషకుడి ఫోన్‌ను మావోయిస్టులతో లింక్ పెట్టి ట్యాప్ చేయడం ఈ కేసులో తీవ్రతను పెంచింది.
సిట్ దర్యాప్తు సంతృప్తికరం
నూతన సిట్ బృందం దర్యాప్తు తీరుపై విచారణ అనంతరం ఆరా మస్తాన్ సంతృ ప్తి వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ అడిగారు. జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే పిలిచారు. నా ఫోన్ 2020 నుంచే ట్యాపింగ్ జరిగిందని అనుమానం ఉంది. ఇప్పుడు అధికారులే డేటా చూపించడంతో అది నిజమని తేలింది. సిట్ విచారణ పారదర్శకంగా, వేగంగా జరుగుతోంది. మరో రెండు నెలల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది అని మస్తాన్ పేర్కొన్నారు.
అవసరమైతే వారం రోజుల తర్వాత మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సిట్ బృందం, ఈ కేసులో మిగిలిన సాక్షులను, బాధితులను విచారిస్తూ దర్యాప్తును వేగవంతం చేసింది. ఆరా మస్తాన్ వాంగ్మూలంతో పాటు, టెక్నికల్ ఎవిడెన్స్‌ను బలపరుచుకుంటూ చార్జిషీట్ దాఖలు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కీలక వ్యక్తులను సిట్ విచారించే అవకాశముంది.