calender_icon.png 31 October, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాతల కష్టం ఆగమాగం

31-10-2025 12:00:00 AM

-ఒరిగిన వరి, నెలపాలైన పత్తి, మిర్చి  

-గాలికి నేలవాలిన పంటలు

-రైతన్నలకు తప్పని నష్టం 

ములుగు, అక్టోబరు30 (విజయక్రాంతి): చేతికొచ్చిన పంట నొటికి దక్కకుండా మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం కర్షకుల కష్టాన్ని నడ్డివిరిచింది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటలను సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి దీంతో వారి కష్టం నీటిపాలైంది. కష్టాలే సాగుబడిలో కన్నీళ్లే దిగుబడిగా మిగిలాయి. కళ్ల ముందే విలు వైన పంట నీటి పాలవుతుంటే చేసేది లేక, వరుణ దేవుడా నష్టాలను భరించే శక్తి తమకు లేదంటూ వేడుకున్నారు.

జిల్లా పరిధిలో గత రాత్రి నుండి కురుస్తున్న వానలు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. కొతకొచ్చిన వరి ములుగు జిల్లాలో వేల ఎకరాలలో నేలవారింది. ధాన్యం తడిసి ముద్దవుతుంది. రాసుల చుట్టూ చేరిన నీటిని తొలగించడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. మంగపేట మండలంలోని కమలాపురం నుండి అకినేపల్లి మల్లారం వరకు ఉన్న సుమారు వెయ్యి హెక్టార్లకు పైగా వరి పంటలు నేలవాలడంతో రైతులు గోస పడుతున్నారు. కోత,కంకి,సుంకు దశలో ఉన్న వరి పంట మొత్తం నేలవాలడంతో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.

మరో వారంలో కోతలు కోయాలనుకున్న వరి పంట మొంథా తుఫాన్ దెబ్బకు పూర్తిగా నేల వాలి ధ్వంసమై పంట చేతికందని పరిస్థితి ఉంది కురిసిన వర్షాలకు మంచి పంట వస్తుందనుకున్న రైతన్నలకు అనుకోకుండా వచ్చిన మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ప్రభావం గురువారం ములుగు జిల్లాలో వెంకటాపూర్ ,మల్లంపల్లి ,గోవిందరావుపేట ,తాడ్వాయి, ఏటూరునాగారం కన్నాయిగూడెం, మంగపేట వెంకటాపురం, వాజేడు మండలాల్లోని తెల్ల వారుజాము నుంచి గంటల తరబడి భారీ వర్షం కురిసింది.

ఈ మండలాలలో  వానాకాలం సాగు చేపట్టిన పత్తి, వరి పంట ఇటీవల వేసిన మిర్చి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే వరుస వర్షాలతో పత్తి చేలు ఊట బట్టి పోగా దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ తరుణంలో చేతికి వచ్చిన పంటను తీసేక్రమంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వాన ముసురు కురుస్తుండటంతో పండిన పంట సైతం చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయింది.  అనేక గ్రామాల్లో వరిపంట నేలకు ఒరిగింది.

నీలపాలైన వరి పత్తి.మిర్చి

జిల్లాలో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నాశనం అవుతుంటే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో కురిసిన వర్షాలతో వరద ముంచెత్తి  గోదావరి పరీవాహక ప్రాంతంలో పత్తి పంటకు 50శాతం నష్టం వాటిల్లింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి కాయ రాలిపో తోంది. పొట్టకు వచ్చిన వరి పంట నేలకొరి గిపోవడంతో ధాన్యం దెబ్బతింటోంది. గ్రామాల్లో అనేక ఎకరాల వరి పంట నేలకొరిగింది. పంటలు చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం  లేదని అన్నదాతలు వాపోతున్నారు. తీసుకొచ్చిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కావడంలేదని తలలు పట్టుకుం టున్నారు.అధికారులు స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసు కోవాలని కోరుతున్నారు.