27-12-2025 02:42:47 AM
90 శాతం కాలిపోయి.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి
నిందితుడు వెంకటేశ్వర్లు రిమాండ్
ముషీరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): నిద్రిస్తున్న భార్యపై భర్తే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అమె అరుపులు ఇని నిద్రిస్తున్న పిల్లలు ఇంట్లోనుంచి బయటికి పరుగులు తీశారు. 90 శాతం కాలిపోయిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. ఈ సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదైన 36 గంటల్లోనే ఈ కేసును ఛేదించి హత్యకు పాల్పడిన భర్త వెంకటేశ్వర్లును నల్లకుంట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఈ మేరకు నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ జే నరసయ్య వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు, త్రివేణి పది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నా రు. ఎనిమిది నెలలుగా అక్రమ సంబంధం పేరుతో భార్యను నానా విధాలుగా హింసిస్తూ వెంకటేశ్వర్లు తరచూ గొడవ పడుతున్నాడు.
డిసెంబర్ 23వ తేదీ రాత్రి మద్యం సేవించి పెట్రోల్ బాటిల్‌తో ఇంటికి వచ్చి నిద్రిస్తున్న భార్యపైలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో పిల్లలు బయటికి పారిపోయారు. త్రివేణి 90 శాతం కాలిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే త్రివేణి మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న నల్లకుంట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్, సీసీ కెమెరాల ఆధారంగా 36 గంటల్లో కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని అదనపు డీసీపి నరసయ్య తెలిపారు.