22-12-2025 01:11:42 AM
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతపు మహద్ అనే చిన్న ఊరిలోని చెరువు నీళ్లు పాచిపట్టి చెత్తాచెదారంతో నిండి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంటాయి. అయినా ఆ నీటిని దళితులు తాకరాదు. ఎందుకంటే అంటరానివాళ్లు ముట్టిన నీళ్లు మైలపడతాయి. కాబట్టి అగ్రకులాల నిఘా నీడన ఉండేదా చెరువు. ఏ పనిమీదైనా మహద్ వచ్చిన దళితులు దాహంతో చస్తున్నా నీళ్లు పుట్టవు. ఆ చెరువు నీటి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వాన దళితులు చేసిన చారిత్రక పోరాటమే ఈ నవల ఇతివృత్తం.
మహద్‌లో ఇంగ్లిష్ చదువుకున్న దళిత యువకుడు రామచంద్ర బాబాజీ మోరే బొంబాయికి వెళ్లి అంబేద్కర్‌ని కలిశాడు. మహద్‌లో దళితుల నీటి కష్టాలు చెప్పి ఉద్యమానికి నాయకత్వం వహించేలా ఒప్పించాడు. అంబేద్కర్ దానిని కేవలం నీటి సమస్యగానే కాకుండా సమానత్వం కోసం పోరాటంగా మలుస్తాడు. రెండు రోజులు మహద్‌లో సభలు నిర్వహించి రెండోరోజు సాయంత్రం అంబేద్కర్ మొదటిసారిగా చెరువులోకి దిగి దోసిలితో నీటిని తాగాడు.
ఆయన వెనుకనే ఉద్యమకారులు కూడా నీళ్లు తాగారు. ఇదంతా గమనిస్తున్న మహద్ బ్రాహ్మణులు పూజారిని రెచ్చగొట్టడంతో అతను ‘దళితులు గుడిలోకి వచ్చేస్తున్నారు’ అని గుండెలు బాదుకుంటూ వీధుల్లో పరిగెత్తాడు. అదే తప్పుడు సమాచారాన్ని చుట్టుపక్కల గ్రామాలకు చేరవేసి మందిని పోగేసి దళితులపై దాడి చేయడంతో కొందరి తలలు పగిలాయి. మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. సభకు వచ్చి తిరిగి తమ గ్రామాలకు కాలినడకన వెళ్తున్న దళితుల పైన కూడా అనేక చోట్ల దాడులు చేశారు.
ప్రతిదాడి చేస్తామన్న దళిత యువకులను అంబేద్కర్ ఆపారు. ఈ విషయాన్నే తరువాత ఓ పత్రికలో ‘మావాళ్లు ప్రతిదాడి చేయబోతే నేనే ఆపాను. ఒకవేళ ఆరోజు మావాళ్లే కనుక ప్రతిదాడి చేసుంటే చరిత్ర మరోలా ఉండేది. ప్రతిదాడితో ఉపయోగం ఉండదని ఆలోచించాను. కానీ, మరోసారి మావాళ్లపై అగ్రకులాలు దాడి చేస్తే అప్పుడు ఏం జరుగుతుందనేది మాత్రం నేను చెప్పలేను’ అని రాశారు. ఇప్పటి మన వర్తమాన కాలంలో కొందరు సవర్ణ సామాజిక విశ్లేషకులు ఒక వింత వాదనను బలంగా వినిపిస్తున్నారు.
అదేమంటే ‘ఒకప్పుడు దళితులపై వివక్ష నిజమే కానీ, ఇప్పుడు దళితులు కూడా బాగా ఎదిగారు. మంచి చదువులు, ఉద్యోగాలు, కారులు, మేడలు సంపాదించారు. ఒకప్పటి కఠినమైన పరిస్థితుల్లో ఇప్పటి దళితులు లేరు’ అని. నిజానికి ఈ వాదన చేసేవాళ్లకి తెలియని విషయం ఏమిటంటే, వందేళ్ల క్రితం మహద్ సంఘటన జరగడానికి చాలా ముందే కొంకణ్ ప్రాంతపు దళితులు కూడా ఇంగ్లిషు చదువుకున్నారు, బ్రిటిష్ సైన్యంలో మంచి ర్యాంకు ఉద్యోగాలు చేశారు. మరికొందరు గవర్నమెంట్ టీచర్లయ్యారు.
రెండంతస్థుల మిద్దెలు కట్టుకున్నారు. పింఛను పుచ్చుకున్నారు. అయితే.. అంటరానితనం కారణంగా తీవ్రంగా బాధించబడడం, దాడులకు గురవ్వడం మాత్రం మారలేదు. ఇప్పుడు కూడా అదే సమస్య. దీన్ని విస్మరించి చేసే అర్ధజ్ఞాన వాదనలకు విలువ ఉండదు. అందుకే.. అంబేద్కర్ మహద్ పోరాటాన్ని కేవలం నీటిసమస్య అనడాన్ని తిరస్కరించారు. ఆ సందర్భంగా ఆయన ఒక పత్రికకు రాసిన వ్యాసంలో ‘మహద్ చెరువు నీళ్లు తాగడంతో దళితులెవరూ అమరులు కారు. అవి తాగకపోయినా మేం బతుకుతూనే ఉన్నాం కదా.
కనుక ఇది చెరువు నీటికోసం చేస్తున్న పోరాటం మాత్రమే కాదు, సమానత్వం కోసం చేస్తున్న ఉద్యమంగా గుర్తించాల్సిందిగా కోరుతున్నా’ అని స్పష్టం చేశారు. అందుకనే ఆ చెరువు దగ్గర రెండోసారి సభ నిర్వహించి కులవివక్షకు మూలమైన మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. వందేళ్ల క్రితం కొంకణ్ పరిధిలో జరిగిన ఈ గొప్ప సత్యాగ్రహం అక్కడొక మాట ఇక్కడొక మాటగా తప్ప ఎక్కడా సమగ్రంగానూ స్పష్టంగానూ నమోదు కాలేదు.
దాన్నంతా సేకరించి ఒకటిగా కూర్చి నవలగా తీసుకురావడం ద్వారా పబ్లిషర్ శేషు కొర్లపాటి, రచయిత మోహన్ తలారి ఆ ఉద్యమానికి సంబంధించి ప్రతీ అంశాన్ని పూర్వాపరాలతో సహా శాశ్వతంగా తెలుగులో అక్షరబద్ధం చేసినవాళ్లయ్యారు. ఉద్యమంతో పాటు ఆ ఉద్యమ కాలపు సమాజాన్నంతటినీ కళ్లకు కట్టినట్టు చూపించాడు తన రాతలో మోహన్ తలారి.
సొలోమోన్ విజయ్‌కుమార్
8341336828