11-09-2025 01:32:10 AM
సంగారెడ్డి, సెప్టెంబర్ 10 :సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ చాకలి ఐల మ్మ తొలి భూ పోరాటానికి నాంది పలికిన సాహసవనితని, రజాకర్ల అరాచకాలకు ఎదురొడ్డి ఎర్రజెండా పట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారన్నారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాదులోని కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయడం ద్వారా అమ్మాయిలకు ఉన్నత విద్యలో కొత్త అవకాశాలు కల్పించిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్, జిల్లా టీజీవో అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్, వెనుకబడిన తరగతుల జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణు, రజక సంఘ సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు,సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.