17-12-2025 12:13:11 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి, డిసెంబర్ 16(విజయక్రాంతి) : జిల్లాలో అమలవుతున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ( నిమ్జ్)తో పాటు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఐఐసీ) ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిమ్జ్, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులతో భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు చెల్లించాల్సిన పరిహారం సకాలంలో అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమ్జ్ ఫేజ్I పరిధిలో మిగిలి ఉన్న భూముల స్వాధీనాన్ని వేగవంతం చేసి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వెంటనే అప్పగించాలని సూచించారు.
ఫేజ్Iలో బర్దిపూర్, ఎల్గోయి గ్రామాల్లో కొంత భూమి ఇంకా స్వాధీనం కావాల్సి ఉందని, అలాగే ఫేజ్II పరిధిలోకి వచ్చే హద్నూర్ గ్రామంలోని కొంత భాగాన్ని కూడా ఎన్‌ఐసీడీసీ అవసరాల కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్‌ఐసీడీసీకి అవసరమైన భూమిలో సుమారు 93 శాతం భూమిని స్వాధీనం చేసుకుని టీజీఐఐసీకి అప్పగించినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.
మిగిలిన భూముల స్వాధీనాన్ని త్వరగా పూర్తి చేసి, ప్రాజెక్టు పురోగతికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. భూసేకరణను వేగంగా పూర్తి చేయడమే కాకుండా రైతులకు తక్షణమే ప్రయోజనం అందేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్జ్ ప్రత్యేక అధికారి విశాలాక్షి, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్, నిమ్జ్ డిప్యూటీ తహసీల్దారు ఆనంద్ కుమార్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.