07-08-2025 12:00:00 AM
సంగారెడ్డి, ఆగస్టు 6(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం మాఫియా చెలరేగిపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు ఉదయం నుండే క్లీనింగ్ పేరిట దుకాణాలను తెరిచి వ్యాపారం కొనసాగిస్తున్నారు. పట్టణంలో ప్రముఖ వైన్ షాపుల లో క్లీనింగ్ పేరిట వైన్స్ షాపులు తెల్లవారు జామునే తెరుచుకుంటున్నాయి.
భవన నిర్మాణ కార్మికులు, మార్కెట్కు వచ్చే కొందరు వ్యక్తులను ఆసరాగా చేసుకుని మద్యం యజమానులు కొందరు ఉదయం 6 గంటల నుంచే దొడ్డిదారిన వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే తాగేవారు వస్తున్నారు కాబట్టి అమ్ముతున్నామంటూ వ్యాపారులు దురుసుగా సమాధానం చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు సైతం నిర్లక్ష్యంగానే జవాబివ్వడం విస్మయం కలిగిస్తోంది.
అడ్డదారిలో మద్యం అమ్మకాలు...
ప్రధానంగా సంగారెడ్డి చౌరస్తా వద్ద గల వైన్ షాపులలో, అదేవిధంగా ఐటిఐ పక్కనున్న వైన్ షాపులో, బైపాస్ రోడ్డు లో ఉన్న వైన్ షాపులలో, మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద ఉన్న వైన్స్ షాపులు ఉదయాన్నే తెరుచుకుంటున్నాయి. పలు షాపులకు ప్రధాన ద్వారంతో పాటు మరో ద్వారం ఉండడంతో వీరి వ్యాపారం గుట్టుగా సాగుతోంది.
అతేగాకుండా కొన్ని షాపుల్లో మద్యం కొలతల్లో తేడాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 90 ఎం ఎల్ కు సుమారు 10 ఎం.ఎల్ వరకు తక్కువ మద్యం అందిస్తూ మద్యం ప్రియులను వ్యాపారులు దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా మద్యం ప్రియులు కొలతల విషయంలో నిలదీస్తే బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.
తెల్లవారకముందే అమ్మకాలు..
సంగారెడ్డిలోని కొన్ని మద్యం దుకాణాల్లో తెల్లవారక ముందే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దుకాణాలను శుభ్రం చేసే నెపంతో ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాతనే వైన్ షాపులు తెరవాలి. ఇందుకు విరుద్ధంగా మద్యం మాఫియా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. అంతేగాకుండా రాత్రి 10 గంటల తర్వాత కూడా దుకాణాలను తెరిచి ఉంచి అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. ఈ తతంగం అంతా ఎక్సైజ్, పోలీసు అధికారులు చూస్తున్నా పట్టించుకోకపోవడానికి మామూళ్లే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
కొరవడిన ఎక్సైజ్ అధికారుల నిఘా...
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మద్యం వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ అధికారుల నిఘా కొరవడింది. ఉదయమే వైన్ షాపులు తెరుచుకోవడం వెనుక ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మద్యం వ్యాపారులు సమయపాలన పాటించక పోవడంతో పాటు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. నెలనెలా ఎక్సైజ్ అధికారులకు మామూళ్ళు అందజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పర్యవేక్షణ, తనిఖీలు కొరవడి యథేచ్ఛగా మద్యం మాఫియా అక్రమ అమ్మకాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.