28-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కూడుకున్నవని, అయితే కొన్ని దుష్టశక్తులు నవరాత్రులను అపవిత్రం చేస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారిని ఆరాధించే సంస్కృతి నుంచి, ఈవెంట్ కల్చర్ ప్రోగ్రామ్స్ పేరుతో దుర్గా పూజలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇలాంటి మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుర్గామాత నవరాత్రులను కార్పోరేట్ పద్ధతిలో న్యూ ఇయర్ ఈవెంట్ మాదిరి కార్యక్రమాలు నిర్వహించడం హిందూ సంస్కృతికి బద్ద విరుద్ధమని పేర్కొన్నారు. అన్య మతస్తులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు విశ్వహిందూ పరిషత్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నిర్వాహకులు అందరూ హిందువులై ఉండాలని, ప్రతి ఈవెంట్లో దుర్గామాత పూజలు నియమ నిష్ఠలతో నిర్వహించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా దసరా పండుగకు హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని వేయడం తగదని ఆయన అన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీలు 50 శాతం పెంచడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా తప్పుపడుతోందన్నారు. బస్సు చార్జీలు పెంచి, పేద ప్రజలకు తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముస్లింల పండుగలకు రాయితీలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. హిందువుల పండుగలకు పన్నుల మీద పన్నులు వేసి తీవ్ర బారం మోపుతున్నారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే ఈ చర్యను ఉపసహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.