calender_icon.png 5 November, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉషోదయ వేళ మంచు మాయాజాలం

05-11-2025 12:18:49 AM

రామప్పపై మంచు  పరదాల సోయగం

వెంకటాపూర్ (రామప్ప), విజయక్రాంతి: రామప్ప గోపురం పై మంచు ముసురుని చీరగా, సూర్యుడు మెల్లగా తొంగి చూసే ఉదయ వేళలో, గాలిలో తేమ, నేలపై తడి పరిమళం, శిలల మధ్య సజీవమై నిలిచిన చరిత్ర స్ఫురణం.. చుట్టూ పక్షుల గుంపు నిద్ర లేచిన సంబరం, పచ్చిక తడి మీద తెల్లని రెక్కల చప్పుళ్లు. ఆ శాంతం, ఆ స్వచ్ఛతలో దాగి ఉన్న దైవతం, రామప్పలో ప్రతి రాయి భగవంతుని శ్వాసలా..

కాలం కదలినా మారని ఆ అందం, మంచు తెర వెనక మెరిసిన కాంతి సాక్ష్యం. మనసు వినగలిగితే వినిపించే మౌన గానం, అది రామప్ప ఉదయం.. మంగళవారం ఉదయం మంచు తాకిడితో రామప్పలో ప్రకృతి కనువిందు చేసింది. రామప్ప దేవాలయం పరిసరాలు మంచు పరదాలతో కప్పుకుని ఆహ్లాదకరంగా మారాయి. తెల్లవారుజామున సూర్యుడు మెల్లగా ఉదయించగా, ఆలయం వెనుకనుంచి వెలువడిన ఆ కాంతి మంచు మబ్బుల గుండా వెండి వెలుగులా ప్రసరించింది.

ఆలయ ప్రాంగణంలో పచ్చిక బయళ్ళపై మంచుతట్టు పరుచుకోవడంతో సహజసిద్ధంగా అద్భుత దృశ్యం కనిపించింది. పక్షుల కిలకిలారావాలతో ఆ వాతావ రణం మరింత మధురంగా మారింది. యునెస్కో వారసత్వ కట్టడం ప్రకృతిలో తేలిన ఈ దృశ్యం ‘విజయక్రాంతి‘ కి చిక్కింది. ఈ చిత్రం స్థానికులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది.