25-07-2025 01:02:24 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూలై 24 (విజయక్రాంతి): విలేకరులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగపరచుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, కార్యక్రమాలను విస్తృత ప్రచారం చేయడం ద్వారా ప్రజలందరికీ తెలిపి పథకాల ఫలాలు పొందే విధంగా చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ మారుమూల గ్రామాల నుండి అభివృద్ధి చెందిన పట్టణాల వరకు తమ పరిధిలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించడంలో పాత్రికేయులు తమ వంతు బాధ్యత నిర్వహిస్తారని తెలిపారు. మీడియా ద్వారా ప్రపంచానికి తెలియని ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయని, ఎంతో మంది బాధితులకు అవసరమైన సహాయం, న్యాయం అందాయని తెలిపారు.
బెదిరింపులకు పాల్పడుతున్నారు...
జిల్లాలో కొంతమంది పాత్రికేయులు అవాస్తవ వార్త కథనాలను ప్రచురిస్తూ వ్యాపార, వాణిజ్య సంస్థలలో, ప్రభుత్వ కార్యాలయాలలో వ్యక్తిగత బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చిందని కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. పాత్రికేయులు తాము ప్రచురించే విషయాలపై పూర్తి నిజనిర్ధారణ చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో కొంతమంది నకిలీ జర్నలిస్టుల కారణంగా అసలైన జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచురిస్తూ, బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.