calender_icon.png 28 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదారి గట్టుపైన ప్రేమ సంగమం

28-09-2025 01:33:36 AM

‘మేమ్ ఫేమస్’తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ బ్యానర్‌పై అభినవ్ రావు నిర్మిస్తున్నారు. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతుండగా, నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ బ్రీజ్‌ను రిలీజ్ చేశారు.

లైట్‌హౌస్‌పైకి తన ప్రేమికురాలిని తీసుకెళ్లిన హీరో, గోదావరి సముద్రంలో కలిసిపోయే అద్భుత దృశ్యం చూపించే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. ‘ఇదే సంగమం.. ఇక్కడే గోదారి సముద్రంలో కలుస్తుంది. ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. మంచినీరు ఉప్పునీరు వేరువేరు తత్వాలు అయినప్పటికీ రెండు ఒకటిగా కలిసిపోతున్నాయి. మనుషులు కూడా ఇలా భేదాభిప్రాయాలు లేకుండా ఒకటిగా కలిసిపోతే ఈ మత భేదాలు అనేవి ఉండవు కదా’ అని సుమంత్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.

గ్లింప్స్ చాలా ఫ్రెష్ అండ్ సోల్ ఫుల్‌గా ఉంది. రచన, దర్శకత్వంలో సుభాష్ చంద్ర ఆకట్టుకున్నారు. సుమంత్ ప్రభాస్ తన పాత్రలో ఇమిడిపోయారు. నిధి ప్రజెన్స్ కట్టిపడేసింది. జగపతిబాబు పాత్రకి ఇచ్చిన పరిచయం ఆసక్తి కలిగించేలా ఉంది. సాయి సంతోష్ చిత్రీకరించిన నేచురల్ విజువల్స్ కథలోని భావోద్వేగాలను మరింత అందంగా మలిచాయి. నాగవంశీకృష్ణ అందించిన సంగీతం అలరించింది. ప్రావల్య ప్రొడక్షన్ డిజైనర్‌గా, అనిల్‌కుమార్ పీ ఎడిటర్‌గా నైపుణ్యం చూపారు.