09-01-2026 12:05:39 AM
నిజాంసాగర్, జనవరి 8 (విజయ క్రాంతి): మత్స్యకారుల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.అయన గురువారం రోజు నిజాంసాగర్ రిజర్వాయర్లో ప్రభుత్వం ద్వారా 100 శాతం సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను విడుదల చేసి మత్స్యకారులకు స్పష్టమైన భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, భద్రమైన ఆదాయం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ మత్స్య సంపదను పెంపొందించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. నిజాంసాగర్ రిజర్వాయర్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగి, రానున్న రోజుల్లో మత్స్యకారులకు మంచి లాభాలు దక్కుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షులు గాదం సత్యనారాయణ, నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈ సోలోమన్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మత్స్యశాఖ అధికారి డోల్ సింగ్ ,ఎంపీడీవో శివకృష్ణ, అచ్చంపేట సర్పంచ్ సంకు లక్ష్మయ్య, ఆరేపల్లి సర్పంచ్ మోహన్, నిజాంసాగర్ మత్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షులు బోయి రామయ్య, మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల నాయకులు, గ్రామ సర్పంచులు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.