29-01-2026 12:00:00 AM
వ్యూహరచనలో ప్రధాన పార్టీలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని పార్టీలకు అగ్నిపరీక్ష కానున్న మున్సిపల్ ఎన్నికలు
సూర్యాపేట, జనవరి 28 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికే షన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్లు ప్రక్రియ కూడా బుధవారం నుండే ప్రారంభం కావడంతో మున్సిపల్ ఎన్నికలు వేడెక్కాయి. నామినేషన్లకు గడువు కేవలం మరో రెండు రోజులే ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలకు అభ్యర్థులను ఖరారు చేయడం కొంతమేర పూర్తవగా మిగిలినవి తలకు మించిన భారంగా మారిపోయింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలు ఉండగా, ఒక్క నకిరేకల్ మున్సిపాలిటీ మినహా మిగతా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
అన్ని పార్టీలు సమాయత్తం
నల్లగొండ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు సమయతనవుతున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల అధికంగా ఉండడంతో ఆ పార్టీకి రెబెల్స్ బెడద పొంచి ఉంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చిన బీఆర్‌ఎస్ సైతం మున్సిపాలిటీలలో అధిక స్థానాలను సాధించేందుకు తగిన ప్రణాళికలను తయారు చేస్తుంది.
దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీ ఆర్ ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీనే నెలకొనే అవకాశం ఉంది. కొన్ని మున్సిపాలిటీలలో పలు వార్డుల్లో బీజేపీ, సీపీఎం పార్టీల ప్రభావం అధికంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ జెండా గుర్తుపై జరగనున్న నేపథ్యంలో పార్టీల బలాబలాలు తోడవ్వనున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే.. మున్సిపల్ ఎన్నికలు కాస్త డిఫరెంట్గా ఉండనున్నాయని చెప్పొచ్చు..
17 మున్సిపాలిటీలు ఇవే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్తోపాటు మిర్యాలగూడ, చిట్యాల, చండూరు, నందికొండ, హాలియా, దేవరకొండ మున్సిపాలిటీలు ఉండగా, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లిలు ఉన్నాయి.
అయితే నకిరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గంకు మే 6 వరకు సమయం ఉన్నందున ఎన్నికలు జరగడం లేదు. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల పరిధిలోనీ 162 వార్డుల్లో సగం సీట్లను మహిళలకు కేటాయించారు. పరిధిలో 6,68,455 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 3,23,613 మంది పురుష ఓటర్లు, 3,44,713 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
గట్టిపోటీ ఇవ్వనున్న బీఆర్‌ఎస్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సుమారు సగం నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ గట్టిపోటీనిచ్చింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్ కు కొంత ఆశాజనకంగా రావడంతో పార్టీ శ్రేణులకు మంచి జోష్ ను ఇచ్చింది. దీంతో అప్పటివరకు అంటిముట్టనట్టుగా తిరిగిన బీఆర్‌ఎస్ నాయకులంతా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. దీనికితోడు ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై ఉంటున్న నేపథ్యంలో తమకు కలిసి వస్తుందని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ క్యాడర్ గంపెడాశలు పెట్టుకుంది.
అక్కడ కాంగ్రెస్‌కు కలవరమే.. !
యాదాద్రి భువనగిరి జిల్లాలో గత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ కు బీఆర్‌ఎస్ గట్టి పోటీచేనిచ్చిందని అర్థమవుతుంది. జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో బీఆర్‌ఎస్ కొంత బలంగా ఉండడంతో మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత కలవరపెట్టే విషయమైనప్పటికీ ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్‌ఎస్ను చావు దెబ్బ కొట్టేందుకు అధికార పార్టీ నాయకులు వ్యూహరచనలు చేస్తున్నారు.
అలాగే సూర్యాపేటలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో సైతం వర్గాలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతుంది. ఇదే బీఆర్‌ఎస్ కు కలసివస్తుందంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం మరోసారి బిఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వొద్దన్న లక్ష్యంతో ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు అందరూ ఏకమై తగిన వ్యూహరచనలు చేస్తున్నట్టు విశ్వసినియంగా తెలుస్తుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పురపోరు ఆసక్తికరంగా మారనుంది.