calender_icon.png 29 January, 2026 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించాలి

29-01-2026 12:12:17 AM

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 28, (విజయక్రాంతి):  జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను  పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించడంలో జోనల్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లోని ఐడిఓసి మీటింగ్ హాల్లో బుధవారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లు (FST), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు (SST), జోనల్ అధికారులు, అకౌంటింగ్ టీమ్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, ఎన్నికల సిబ్బంది నియామకం, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టి శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత జోనల్ అధికారులదేనని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ స్పందన అందించాలని సూచించారు. స్పష్టమైన ఆధారాలు (ఎవిడెన్స్) సేకరించిన అనంతరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి  శ్రీరామ్ మాట్లాడుతూ, మద్యం స్వాధీనం (లిక్కర్ సీజ్యూర్) జరిగిన సందర్భాల్లో తప్పనిసరిగా వాటిని ఎక్సైజ్ శాఖకు అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ప్రదేశానికి చేరుకుని స్పాట్ వెరిఫికేషన్ నిర్వహించి, మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు.

అవసరమైన సందర్భాల్లో FST బృందాలు SST బృందాలకు మార్గదర్శకత్వం అందించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్ను 24 గంటల్లోపు సంబంధిత న్యాయస్థానంలో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మహిళల హ్యాండ్బ్యాగ్ల తనిఖీని మహిళా అధికారులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, అకౌంటింగ్ టీమ్ సభ్యులు తమ తమ విధులు, బాధ్యతలు అనుసరించాల్సిన విధివిధానాలపై వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, రాజశేఖర్, ఎంపీడీవోలు శ్రీనివాస్, సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.