calender_icon.png 8 January, 2026 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హేటిరో పరిశ్రమ వల్లే నల్లకుంట చెరువు కాలుష్యం

07-01-2026 12:00:00 AM

కాలుష్య వ్యతిరేక పోరాట సమితి 

గుమ్మడిదల, జనవరి 6: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు శివారున గల నల్లకుంట చెరువు కాలుష్యం అవడానికి హెటిరో డ్రగ్స్ పరిశ్రమనే కారణమని కాలుష్య వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మంగయ్య ఆరోపించారు. మంగళవారం సమితి ప్రతినిధులు, రైతులు, దోమడుగు నివాసులు నల్లచెరువును సందర్శించి, నీటిని పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

2012లో సేకరించిన నమూనాల్లో చెరువులోని నీరు గులాబీ రంగులోకి మారినట్టు అధికారికంగా ప్రకటించిందని ప్రమాదకర రసాయనాలు ఈ చెరువు నీటిలో ఉన్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిర్ధారించిందని అందుకు సంబంధించిన పత్రాలను చూపించారు. నల్లచెరువు కాలుష్యానికి కారణమైన హెటీరో పరిశ్రమ తగిన చర్యలు చేపట్టాలని కోరారు. చెరువులోని నీటిని శుద్ధిచేసి కాలుష్య రహితంగా మార్చాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.

మానవ హక్కుల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేసిన పరిశ్రమ యాజమాన్యం స్పందించడం లేదని ఆదేశపత్రాలను విలేకరులకు చూపించారు. పరిశ్రమ తప్పిదం లేదంటూనే పరిశ్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులతో బేరసారాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను మభ్యపెట్టి నీటి పరీక్ష ఫలితాలను విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఈ ప్రాంతం అధికారులు, నాయకులు పరిశ్రమకు తొత్తులుగా మారి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. దోమడుగు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలకు న్యాయం జరగకపోతే రానున్న ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాలుష్య పోరాట వ్యతిరేక సమితి కో కన్వీనర్లు స్వేచ్ఛ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్, సత్యనారాయణ, బాల గౌడ్, సత్తిరెడ్డి, జగన్, అశోక్ కుమార్ కెవిపిసి సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.