calender_icon.png 24 August, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే ఒక్కడు!

24-08-2025 01:19:17 AM

హన్మకొండ వేయిస్తంభాల త్రికూటాలయంలో నృత్య నరసింహుడు 

తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన నాట్య నరసింహుని శిల్పం హన్మకొండ వేయిస్తంభాల త్రికూటాలయంలోని వాసుదేవ ఆలయం ద్వారం మీద లలాటబింబంగా చెక్కి ఉంది. ఉత్తరాభిముఖంగా ఉన్న 2అడుగుల ఎత్తు శిల్పం. మకరతోరణం కింద భక్తులు, వాద్యకారులు స్వామిని కొలుస్తూ కనిపిస్తున్నారు. పుష్పవేదిక మీద కుడిమోకాలి వద్ద వంచి, ఎడమకాలు కొంచెం ఎత్తి, దేహాన్ని కుడివైపునకు వంచి చతుర నాట్యభంగిమలో అష్టభుజుడు, నరసింహమూర్తి కనిపిస్తున్నాడు.

చక్రం, గద, ఖడ్గం, అభయముద్ర, శంఖం, డాలు, ఒక ఎడమచేయి అడ్డంగా పెట్టి ఉంది. తలపై గుండ్రని ఎత్తయిన కరండ మకుటం ధరించి ఉన్నాడు. నామం, జంధ్యం, కంఠిక, కేయూరాలు, కంకణాలు, ఉదరబంధం, కడియాలు అలంకారంగా ఉన్నాయి. కుడిచేతి కింద గరుడుడు, ఒక స్త్రీ నాట్యభంగిమలో నిల్చుని కనిపిస్తున్నది. చామరధారులు రెండువైపులున్నారు. ఇటువంటి నాట్య నరసింహుని శిల్పం తెలంగాణ లోని మరొక దేవాలయంలో కనిపించదు. నందికంది గుడి మంటప స్తంభం మీద చెంచితతో శృంగార భావంతో నాట్యం అనిపించే భంగిమలో కనిపిస్తాడు. వెల్గుర్ది తోరణస్తంభం మీద కూడా అటువంటి శిల్పమే ఉంది.ఈ శిల్పం అరుదు. ఈ నాట్యభంగిమలో నరసింహుని చెక్కిన తీరు అమోఘంగా ఉంది.

నేను 2014లో ఈ శిల్పాన్ని ఫొటో తీసి ఎక్కడ దాచానో మరిచిపోయాను. ఇవాళ ఆ శిల్పాన్ని చూశానని సుపర్ణమహి చెప్పగానే వెతికిపట్టుకున్నాను. మహి ఇటువంటి శిల్పాన్ని మరెక్కడా చూడలేదని మురిపెంగా చెప్పాడు. శిల్పం అమూర్త భావనలకు మూర్తిమత్వం ఇస్తుంది. దాని వెనక మతం, దైవం, ఆరాధానారీతులుంటాయి.శిల్పి తన సృజనలో వీటిని ప్రతిఫలించేటట్లు చెక్కడమే అద్భుతం.