calender_icon.png 24 August, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరాలిచ్చే కొంగుబంగారం కురవి వీరభద్రుడు

24-08-2025 01:18:06 AM

కురవి వీరభద్రున్ని దర్శించుకుంటే భయాన్ని తొలగించి, జయాన్ని ప్రసాదించడంతోపాటు మానసిక ఒత్తిడి తగ్గించి, చెడు దృష్టి నుంచి రక్షణగా ఉంటాడనే నమ్మిక. అలాగే కోరిన కోరికలు నెరవేరాలని వరాలు పడితే వరాలిచ్చే కొంగుబంగారంగా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని ఇలవేల్పుగా కొలుస్తారు.

ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన శివాలయాల్లో ఒకటిగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం నిలుస్తోంది. ఈ ఆలయాన్ని తూర్పు వేంగి చాళుక్యుల యుగంలో 850 ఏడీలో రాజా భీమరాజుచే నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. తర్వాత కాకతీయ కాలంలో 1, 2వ బేత రాజుల కాలంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణ చేసినట్లు పురాణ గాథల ఆధారంగా పేర్కొంటున్నారు. ప్రతాప రుద్రుడు ఇక్కడ పెద్ద తటాకం నిర్మించగా, రాణి రుద్రమదేవి తరచుగా ఈ దేవాలయాన్ని సందర్శించినట్లు ఆధారాలున్నాయి.

ఉగ్రరూపంలో స్వామివారు

ఉగ్రరూపంలో శ్రీ వీరభద్ర స్వామి మూడు కళ్లు, 10 చేతులు కలిగి శివ జగంతో కోపమని ప్రాతినిధ్యం వహించే వాడని, భద్రకాళి వెంటనే దీన్ని శాంతింప చేసేందుకు రాగా వీరభద్రుడు ఆమెను వివాహం చేసుకున్నట్టు పురాణ కథ. ఆలయంలో వీరభద్ర స్వామి, భద్రకాళి, గణపతి, రామలింగేశ్వర స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, హనుమంతుడు, నాగేంద్రుడు, సప్తమాత్రికలు, నవగ్రహాలను ప్రతిష్టించారు. ఎత్తున వేదికపై నిర్మించిన 70 అడుగుల గోపురంతో ప్రవేశద్వారం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయంలో ప్రాకారాలు, గుడులు, కల్యాణమంటపం ఉన్నాయి. ఒకప్పుడు దట్టమైన ‘కారడవి’గా ఉండే ఈ ప్రాంతం కాలక్రమేన ‘కురవి’గా మారిందని చెబుతారు. 

స్వామికి కోర మీసాలు..అమ్మవారికి జంతు బలులు

కురవి వీరభద్రునికి కోరమీసాలు ప్రీతిపాత్రం. భద్రకాళి అమ్మవారికి జంతు బలులు ఇష్టం. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా స్వామిని దర్శించుకున్న తర్వాత అభిషేకం నిర్వహించి, వెండి, బంగారు కోర మీసాలు సమర్పించి, అనం తరం అమ్మవారికి ముక్కుపోగు, గాజులు సమర్పించి, కోళ్లు మేక లు బలివ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ప్రాంతంలోని ప్రజ లు స్వామివారిని ఇలవేల్పుగా కొలవడం, పండిన పంటలో కొంత స్వామివారికి సమర్పించడం, సంతానప్రాప్తి తర్వాత పుట్టి న పిల్లలకు ‘అన్నప్రాసన’ కార్యక్రమాన్ని దేవాలయంలో నిర్వ హించడం విశేషంగా భావిస్తారు.  రాజీవ్‌గాంధీ మొదలుకొని కేసీ ఆర్ వరకు అనేక మంది ప్రముఖులు వీరభద్ర స్వామి దేవాల యాన్ని సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత కోరిన కోర్కె నెరవేరిందని ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కురవికి వచ్చి స్వామికి బంగారు కోరమీసాలు సమర్పించారు. 

ప్రతి శివరాత్రికి జాతర

ప్రత్యేక మహాశివరాత్రికి బ్రహ్మోత్సవం 16 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. పూజలు, జాగరణలు, స్వామి వారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉగాది, వినాయక చవితి, సంక్రాంతి, శ్రీరామనవమి, దీపావళి వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. శివరా త్రి  వేడుకలకు జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆ సందర్భంలో  రాష్ట్ర నలు మూలల నుంచి వేలాది మంది భక్తులు కురవికి వస్తారు. కురవి దేవాలయానికి చేరడానికి మహబూబాబాద్ వరకు రైలుమార్గం ఉండగా, అక్కడి నుంచి ఆర్టీసీ, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. స్వామివారి కల్యాణ వేడుకల్లో తలంబ్రాల కోసం భక్తులు పోటీ పడడం విశేషం. తలంబ్రాలను తమ ఇంట్లో జరిగే ప్రతి శుభ కా ర్యాల్లో స్వామి అమ్మవార్ల కృపకు తార్కాణంగా చెప్పుకుంటారు.

ప్రతి సోమవారం పూర్ణాభిషేకం

శ్రీ భద్రకాళి సమేత కురవి వీరభద్ర స్వామికి ప్రతి సోమ వారం పూర్ణాభిషేకం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకుడు రెడ్యాల శ్రీనివాసులు తెలిపారు. మిగిలిన ఆరు రోజులు స్వామి వారి పాదాలకు మాత్రమే అభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

 సంపత్ కుమార్, విజయ క్రాంతి, మహబూబాబాద్