14-08-2025 12:53:14 AM
కోనరావుపేట ఆగస్టు13 (విజయక్రాంతి):కలల సౌధం ఇందిరమ్మ ఇండ్ల రూపంలో అల్లుకుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం కొలనూరు పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో కలకుంట్ల లక్ష్మణ్ రావు, రమణ దంపతులు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారు అయిన ఆడబిడ్డ రమణకు చీర సారే పెట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల స్వంత ఇంటి కల నెరవేరుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని వెల్లడించారు.కోనరావుపేట మండలం కొలనూరు పరిధిలోని గొల్లపల్లి ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని గుర్తు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లును ఈ రోజు ప్రారంభించామని తెలిపారు.గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే తప్ప గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా కట్టించలేదని విమర్శించారు.రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేని ఊరు మేం చూపిస్తాము మీరు ఓట్లు అడగకుండా ఉండాలి అని సవాల్ విసిరారు.
ఎన్నికల సమయంలో మేం చేసిన సవాలను స్వీకరించలేదని పేర్కొన్నారు.ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు..ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారు సంతోషంగా తాము పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు అనీ ఆనందంతో అంటున్నారని విప్ పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఆనాడు చేసినట్లుగా నేడూ గృహ ప్రవేశ సమయంలొ చీర సారే పెట్టడం జరిగిందని గుర్తు చేశారు.మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఎంపీడీవో శంకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.