14-08-2025 12:54:53 AM
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
జగిత్యాల అర్బన్, ఆగస్టు 13 (విజయక్రాంతి): మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగి భవిష్యత్తును నిర్మించుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొన్న ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా బైపాస్ రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్,ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ,గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్, ఇతర నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించగలుగుతామన్నారు. ఈనెల 18 న హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ల చేతుల మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వృత్తి రీత్యా కల్లుగీత కార్మికుడు అయినప్పటికీ తన శక్తి సామర్థ్యాలతో సైన్యాన్ని ఏర్పాటు చేసి గోల్కొండ ఖిల్కొండ ను జయించిన గొప్ప వీరుడని అభివర్ణించారు. సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ స్ఫూర్తితోసామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తులో బహుజనులు అధికారం వైపు పోవాలని పిలుపునిచ్చారు. గీత కార్మికులు ఉన్నత చదువులు చదువుకోవాలని విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు.
వృత్తి పరమైన నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో 40 లక్షల ఈత మొక్కలు,5 లక్షల తాటి మొక్కలు నాటి సంరక్షించాలని నిర్ణయం తీసుకుందన్నారు.ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉపాధి హామీ ద్వారా మొక్కలు పెట్టి వాటిని పెంచే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని దీనికి గీత కార్మిక సంఘాలు ముందుకు రావాలని సూచించారు. జిల్లాలో గౌడ హాస్టల్ ఏర్పాటుకోసం కృషి చేస్తానన్నారు.