19-07-2025 11:27:09 PM
పార్టీ పదాధికారులకు బీజేపీ జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ పిలుపు..
అదిలాబాద్ (విజయక్రాంతి): త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ఓ సైనికుల్లా పని చేయాలని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఆదిలాబాద్ జిల్లా పార్టీ ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్(Adilabad District Party In-Charge Aljapur Srinivas) పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ పదాధికారులతో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ లో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ మేరకు జిల్లా పార్టీ ఇంచార్జీ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకే కాదు, గ్రామీణ ప్రాంతవాసులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇదే అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు వివరిస్తు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరేస్తాం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మాదిరిగా బూతులతో, సవాళ్లు - ప్రతిసవాళ్ల తో ప్రజల దృష్టిని మరల్చే అవసరం బీజేపీ కి లేదని అన్నారు. ప్రతి కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టించాలని అన్నారు.