13-01-2026 12:48:51 AM
కరీంనగర్ క్రైమ్ జనవరి12 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ ‘చింతకుంట’ బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 19న కరీంనగర్లో జరిగే సర్పంచుల సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పార్టీ కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో గంగుల కమలాకర్ మాట్లాడుతూ... గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్, జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండిలో గత 45 ఏళ్లలో జరగని అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధి పనులే ఎన్నికల్లో తమ ఆయుధమని, ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్‌ఎస్కే ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా ఏంటో మరోసారి నిరూపించాలని అన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని, అదే జోరు మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు రసమయిబాలకిషన్, వి. సతీష్ కుమార్, సుంకే రవి శంకర్, మాజీ ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణ్ రావు, కరీంనగర్ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జి.వి. రామకృష్ణరావు, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ,మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ జడ్పీచైర్మన్ తుల ఉమ, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పొన్నం అనిల్లతో పలువురు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.