calender_icon.png 29 January, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమనగల్లు ‘పుర’పోరు

29-01-2026 12:00:00 AM

చైర్మన్ పీఠం ఎవరిది? జనరల్ కోటాతో మారిన లెక్కలు!

ఆమనగల్లు, జనవరి 28(విజయక్రాంతి): దక్షిణ రంగారెడ్డి జిల్లాలోని కీలక మున్సిపాలిటీ అయిన ఆమనగల్లులో రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. ఈసారి మున్సిపల్ చైర్మన్ పీఠం ‘జనరల్’ (అన్-రిజరవ్డ్) కావడంతో ఆశావహుల సంఖ్య చాంతాడంత పెరిగింది. పాత ముఖాలతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువనేతలు కూడా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహలాడుతున్నారు.

మహిళా ఓటర్లే ‘కింగ్ మేకర్లు’

ఆమనగల్లు మున్సిపాలిటీలో గెలుపోటములను శాసించేది మహిళా ఓటర్లే అని గణాంకాలు చెబుతున్నాయి. 

మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు 16,984 ఉండగా అందులోమహిళలు: 8,509, పురుషులు: 8,475. పురుషుల కంటే 34 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో, వారిని ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తేనే గెలుపు సులభమవుతుందని భావిస్తున్నాయి.

అధికార పార్టీ వ్యూహం: ‘అభివృద్ధే మా అస్త్రం’

అధికార పార్టీ నాయకులు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులే తమను గట్టెక్కిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విఠాయిపల్లి, శ్రీనివాస కాలనీ వంటి పట్టున్న వార్డు లో  కీలక ఓటు బ్యాంకులను కాపాడుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం విడుదలైన నిధుల తో ఇటీవల మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత మున్సిపల్ పాలకవర్గం అసమర్ధత పాలన పై పలు విమర్శలు ఎక్కుపెట్టాలని ఎత్తు గడలు వేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్  జనరల్ కోటా కావడంతో బలమైన సామాజిక వర్గ నేతలను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు.

‘సమస్యలపై సమరం’

ప్రతిపక్షాలు (BRS, BJP, మరియు ఇతర పార్టీలు) పట్టణంలోని సమస్యలనే ప్రధాన అజెండాగా మార్చుకుంటున్నాయి. అధికార పార్టీ వైఫల్యాల ఎండగట్టాలని చూస్తుంది. మున్సిపాలిటీ లో  శివాలయం నగర్, శాంతి నగర్, బీసీ కాలనీల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న డ్రైనేజీ సమస్య, శ్రీకాంత్ కాలనీ, పలు తండాలు, గుర్రం గుట్ట కాలనీలో చెత్త డంపింగ్ కేంద్రం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ‘కోట్లు కేటాయించినా మౌలిక సదుపాయాలు ఎక్కడ?‘ అంటూ అధికారులను, అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు.

వార్డుల వారీగా రసవత్తర పోరు

ప్రతి వార్డులో సగటున 985 మంది ఓటర్లు మాత్రమే ఉండటంతో, కేవలం 10 నుండి 50 ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతి వీధిలోనూ అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

గెలుపును శాసించే అంశాలు

చిరు వ్యాపారులకు గత కొన్ని ఏళ్లుగా  షాపింగ్ కాంప్లెక్స్ కలగా నే మిగిలింది. దాదాపుగా పట్టణం లో 500 కుటుంబలకు కాంప్లెక్స్ నిర్మాణం అయితే వారికి బతుకుదెరువు కు ఆధారం దొరుకుతుంది. దీంతో మెజారిటీ చిరు వ్యాపారులు కాంప్లెక్స్ హామీ పై ఆశలు పెట్టుకొన్నారు.బీసీ కాలనీ, శాంతి నగర్లలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి వస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.

గుర్రం గుట్ట కాలనీ ప్రజలు చెత్త సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల డంపింగ్ యార్డు పై నే అధికార, ప్రతి పక్ష పార్టీ లు రాజకియం తిరిగింది. మున్సిపల్ చైర్మన్ జనరల్ కోటా కావడంతో సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత పరపతి ఉన్న నేతలకు ఎక్కువ అవకాశం ఉంది ప్ర ధాన పార్టీలు దీనిపైనే దృష్టి పెట్టాయి.  ఆమనగల్లు ‘పుర’ సమరంలో విజేత ఎవరో తెలియాలంటే మహిళా ఓటర్ల మనసు గెలవాల్సిందే. చైర్మన్ పీఠం కోసం జరుగుతున్న ఈ పోరులో ఆశావహుల ఎత్తుగడలు పారుతాయా? లేక ప్రజలు మార్పు కోరుకుంటారా అనేది వేచి చూడాలి.

ఆమనగల్లు మున్సిపాలిటీలో వార్డుల వారీగా..

1 చంద్రాయన్ పల్లి తండా

 (జనరల్ మహిళ)

2 ముర్తుజపల్లి(ఎస్సీ మహిళ)

3 నుచ్చుగుట్ట తండా 

(జనరల్ మహిళ)

4 జంగారెడ్డిపల్లి(జనరల్)

5 ఎస్సీ కాలనీ జనరల్

6 సాయి నగర్ (గుర్రం గుట్ట) ఎస్టి

7 వెంకటేశ్వర కాలనీ (ఎస్టి)

8 బీసీ కాలనీ (ఎస్సీ జనరల్)

9 విద్యానగర్ కాలనీ(జనరల్)

10విఠాయిపల్లి(జనరల్ మహిళ)

11 ఆదర్శనగర్ కాలనీ (ఎస్టి మహిళ)

12 శాంతినగర్ కాలనీ (బిసి జనరల్)

13శ్రీనివాస కాలనీ (ఎస్టి మహిళ)

14అంబేద్కర్ నగర్,ప్రేమ్ నగర్ (జనరల్)

15 శివాలయం (జనరల్ మహిళ)