calender_icon.png 9 December, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలి

09-12-2025 01:43:05 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం పెద్దమందడి, ఖిల్లా గణపురం మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్ని సందర్శించారు. పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణను, పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల పోలింగ్ పూర్తిగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమని కలెక్టర్ సూచించారు. ఫారం 14 దరఖాస్తు చేసుకున్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సిబ్బంది సహకరించాలని సూచించారు. ఎన్నికల విధుల అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ, (వోటర్ ఐడీ) లేదా మరో గుర్తింపు కార్డు జిరాక్స్ తనిఖీ చేయాలన్నారు. ఓటు వేసిన వారిని ఓటర్ లిస్ట్లో నమోదు చేయాలని సూచించారు.

అంతేకాక, పోలింగ్ సమయంలో ఎటువంటి లోపాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని, నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆయన ఉద్యోగులను ఆదేశించారు. ఓటు వేయడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొని సిబ్బంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.  పెద్దమందడి తహసిల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో పరిణత, ఘనపురం తహసిల్దార్ సుగుణ, ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.