16-11-2025 12:00:00 AM
దేశంలోని అన్ని పాఠశాలలకు ప్రేరణ: ప్రిన్సిపాల్ ఆంటోనీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): హైదరాబాద్ అబిడ్స్‌లో ఉన్న లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు అబుదాబిలో జరిగిన ప్రతిష్ఠాత్మక రోబోకప్ ఆసియాపసిఫిక్ పోటీల్లో గొప్ప విజయాన్ని సాధించారు. మన దేశ ప్రతిభను మరింత ఇనుమడింప చేశారని ప్రిన్సిపాల్ బ్రదర్ ఆంటోనీ తెలిపారు. ఈ అంతర్జాతీయ పోటీలలో వివిధ దేశాల నుంచి వచ్చి న జట్లు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తమ వినూత్న సామర్థ్యాలను ప్రదర్శించారని, ఈ సందర్భంగా బ్రదర్ ఆంటోనీ తెలిపారు.
లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ బృందం సాధించిన విజయాలు
ఇన్ఫ్లూయెన్సర్ అవార్డ్ విభాగంలో మొదటి స్థానం. బెస్ట్ లెర్నింగ్ జర్నల్ (టీమ్ డిస్క్రిప్షన్ పేపర్) విభాగంలో మొదటి స్థానం. సూపర్ టీం చాలెంజ్‌లో రెండవ స్థానం. రోబోకప్ ఆసియాపసిఫిక్ 2025 ప్రధాన ఈవెంట్లో మూడవ స్థానం. 10వ తరగతి విద్యార్థులు అహ్మద్ ఒమర్, మొహమ్మద్ అర్సలాన్, మొహమ్మద్ రయ్యాన్ ఖాన్, అబ్దుల్ రాఫే పోటీల్లో తమ అత్యుత్తమ ప్రతిభను, జట్టు సహకారాన్ని ప్రదర్శించారు.
విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో కీలక పాత్ర పోషించిందని బ్రదర్ ఆంటోనీ గుర్తు చేశారు. ఈ విజయం దేశంలోని పాఠశాలల విద్యార్థులకు ప్రేరణ, ప్రోత్సాహాన్నీ అందించగలదని ఆశిస్తున్నామని బ్రదర్ ఆంటోనీ తెలిపారు.