12-08-2025 12:54:44 AM
మార్కెటింగ్, మున్సిపల్ అధికారులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్ వేణారెడ్డి
సూర్యాపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి) : ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయంలో గత ప్రభుత్వానిది ఆరంభ శూరత్వమేనని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను మార్కెటింగ్, మున్సిపల్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లోకి గాలి వెలుతురు సక్రమంగా లేని కారణంగా రూ. 35 కోట్ల బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయిందన్నారు.
కెసిఆర్ ప్రారంభించిన తర్వాత నాలుగు రోజులు మాత్రమే నడిపారని గాలి, వెలుతురు సరిగా లేక వ్యాపారులు తిరిగి రోడ్లపై పెట్టి వ్యాపారం నిర్వహిస్తున్నారన్నారు. ఈ విషయంపై మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, మార్కెట్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వాడకంలోకి తేవాలని కోరగా స్పందించిన మంత్రులు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను సందర్శించాల్సిందిగా తెలిపారన్నారు.
తదుపరి తదుపరి రెండు, మూడు రోజుల్లో కలెక్టర్ కు నివేదిక సమర్పించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఎస్సీ లక్ష్మణ్ గౌడ్, డిఈ రవికుమార్, మార్కెట్ సెక్రటరీ ఎండి ఫసియోద్దీన్, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, ఈఈ కిరణ్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.