calender_icon.png 27 July, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం ఖరీదు మూడు లక్షలు

26-07-2025 12:10:00 AM

- డీల్ కుదిర్చిన ఎస్సైలు, పెద్దమనుషులు

- అనుమతి లేకున్నా సర్జరీ చేసిన డాక్టర్

- వికటించి దళిత యువకుడి దుర్మరణం

- వనపర్తి జిల్లా పెబ్బేరు రాఘవేంద్ర ఆస్పత్రిలో ఘటన

పెబ్బేరు, జూలై 25: వనపర్తి జిల్లా పెబ్బేరులోని శ్రీ రాఘవేంద్ర ఆసుపత్రి వైద్యుడు రాఘవేంద్రరెడ్డి చేసిన ఆపరేషన్ వికటించి ఎస్సీ యువకుడు మృతిచెందాడు. ఆస్పత్రిపై కేసు నమోదు కాకుండా ఉండేందుకు స్వయంగా పోలీసులే రంగంలోకి దిగి, పెద్దమనషుల సమక్షంలో బాధిత యువకుడి కుటుంబంతో మాట్లాడి రూ.3 లక్షలకు ఒప్పందం కుదిర్చారు. ఎంబీబీఎస్ చేసిన తంగెడంచు రాఘవేంద్రరెడ్డి పెబ్బేరు మండల కేంద్రంలో శ్రీ రాఘవేంద్ర ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు.

అతడికి సర్జరీ చేసే అనుమతి లేదు. అయితే పెబ్బేరు మండల పరిధిలోని పెంచుకలపాడు గ్రామానికి చెందిన దళిత యువకుడు కాటెపాగ రాజు(39)కు భార్య రాధతో పాటు 10 సంవత్సరాలలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాజు మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు మెడపై కణితి కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. ఐదురోజుల క్రితం శ్రీ రాఘవేంద్ర ఆసుపత్రిలో డాక్టర్ రాఘవేంద్రరెడ్డితో వైద్యం చేయించుకున్నాడు. మరుసటి రోజు కణతిని పూర్తిగా సర్జరీ చేసి తొలగించాడు. రెండవరోజు చీము పట్టడంతో ఆసుపత్రికి వచ్చాడు. మళ్లీ చికిత్స చేసిన డాక్టర్ ఏమీకాదు వెళ్లమని చెప్పాడు.

గురువారం పొలం పనికి వెళ్లిన రాజు స్పృహ కోల్పోయి పొలంలో పడిఉండటం స్థానికులు గమనించారు. మళ్లీ రాఘవేంద్రరెడ్డి వద్దకు తీసుకెళ్లగా చేతులెత్తేశాడు. వనపర్తికి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చారని కుటుంబీకులు తెలిపారు. హుటాహుటిన వనపర్తికి రాజును తరలించారు. అక్కడ ఆసుపత్రి వారు మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో టెస్టు లు చేయగా సరైన విధంగా సర్జరీ చేయకపోవడంతో తలలో నరాలు తెగి బ్లీడింగ్ అవుతుందని చెప్పారు. తక్షణమే నిమ్స్‌కి వెళ్లాలని సూచించారు. నిమ్స్‌కు వెళ్తుండగానే రాజు మృతి చెందాడు.

దీంతో డాక్టర్ రాఘవేంద్రరెడ్డి ఆసుపత్రి ముందు రాజు బంధువులు ఆందోళన చేపట్టారు. ఆందోళన ఉధృతం కావటంతో యాజమాన్యం పోలీసుల సహాయం కోరింది. పెబ్బేరు ఎస్సై గంగిరెడ్డి యుగంధర్‌రెడ్డి, శ్రీరంగాపూర్ ఎస్సై రామకృష్ణ ఆసుపత్రికి చేరుకుని శాంతియుతంగా ఆందోళన ఉండాలని మృతుని బంధువులను హెచ్చరించారు. అనంతరం రాజకీయ నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు భారీగా చేరుకోవడంతో యాజమాన్యం బేరసారాలకు దిగింది. ఇద్దరు ఎస్సైలు, రాజకీయ పెద్దల సమక్షంలో డాక్టర్ తంగెడంచు రాఘవేంద్రరెడ్డి చాంబర్‌లో చర్చలు జరిగాయి.

రూ.3 లక్షలు నగదు వచ్చే బుధవారం యాజమాన్యం ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిర్చారు. రూ.10 వేలు అంత్యక్రియలు చేయటానికి తక్షణమే ఇస్తున్నట్లు, నాయకులు పోలీసులు ప్రకటించడంతో ఆందోళన ముగిసింది. వైద్యుడి నిర్లక్ష్యంతో ప్రాణాలుపోతే ఆ ప్రాణానికి వెల కట్టడం ఏమిటని కొందరు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మృతుడి భార్య, ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి మూడులక్షలు డిపాజిట్ చేయాలని పెంచుకలపాడు గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.