27-12-2025 01:57:38 AM
బేల, డిసెంబర్ 26 (విజయక్రాంతి): బేల మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన సోయాబీన్ పంటను ప్రభుత్వం నిరాకరించింది. నాణ్యత లేదంటూ అధికారులు సోయా పంటను తిరస్కరిస్తున్నారు. మండలంలో సాంగిడి గ్రామానికి చెందిన రైతు సునీల్ రెడ్డితో పాటు ఇతర రైతులు మొత్తం 450 క్వింటాళ్ల సోయాను అమ్మడానికి మార్కెట్ యార్డు కు తీసుకొచ్చారు.
ఐతే సొసైటీ అధికారులు సోయను కొనుగోలు చేసి మూడు లారీల్లో దాదాపుగా 220 క్విం టాల సోయను లోడింగ్ చేసి జిల్లా కేంద్రానికి పంపించారు. కానీ పంట నాణ్యత సరిగా లేదంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరస్కరించారు. దింతో శుక్రవారం ఆ మూడు లారీల్లో దాదాపుగా 220 క్వింటాల సోయాను తిరిగి బేల మార్కెట్ యార్డ్ లో అన్లోడింగ్ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు మార్కెట్ యార్డ్‌కి వచ్చి తమ పంటను చూసి నిరాశ చెందారు.
ఈ సందర్బంగా రైతు మాట్లాడుతూ ప్రకృతి కారణంగా పంట నష్టం జరిగితే తామేమి చేయగలమని రైతు వాపోయాడు. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం దండుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తుల అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతే రాజు అని అంటున్నారు, కానీ రైతుని రాజు చేయకపోయినా పర్వాలేదు కానీ బిచ్చగాన్ని మాత్రం చేయకండి అని ప్రభుత్వాలను కోరారు.