calender_icon.png 25 December, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తింపు సంఘం వైఫల్యంతోనే సింగరేణి వేడుకల కుదింపు

25-12-2025 02:15:54 AM

టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి

బెల్లంపల్లి, డిసెంబర్ 24 : సింగరేణిలో గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ వైఫల్యంతోనే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నిధులను తగ్గించారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధ వారం బెల్లంపల్లిలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకే తలమానికమైన సింగరేణిలో సింగరేణి వేడుకలను తగ్గించి నిర్వహించడం సింగరేణి కార్మికులను అవమానించడమేనన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా సింగరేణి యాజమాన్యం నడుచుకుంటూ కోట్ల రూపాయలను వివిధ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటే గుర్తింపు సంఘం నోరుమెదపలేదని, సింగరేణి వేడుకలకు డబ్బులు తగ్గించి ఇవ్వడాన్ని ఆపలేకపోయిందని మండిపడ్డారు. ఏఐటీయూసీ పూర్తిగా అన్ని విషయాలలో వైఫల్యం చెందిందని, ఈ మధ్య కాలంలో వచ్చిన సర్కులర్లను ఆపలేకపోయిందని ధ్వజమెత్తారు. కార్మికులకు అన్యాయం జరుగు తున్న ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. సింగరేణి వేడుకలను తగ్గించడానికి ఆపే శక్తి లేక గనుల మీద అడ్డుకున్నట్టు షో చేయడాన్ని ఎద్దేవా  చేశారు. 

బెనిఫిట్స్ ఆపడం దారుణం...

రిటైర్డ్ అయిన కార్మికులు క్వార్టర్ ఖాళీ చేయాలనే నిబంధన పెట్టి లాభాల వాటా, దీపావళి బోనస్ చెల్లింపులు ఆపడాన్ని టీబీజీకేఎస్ అధ్యక్షుడు రాజిరెడ్డి ఖండించారు. కొడుకుకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత అతని పేరు మీద క్వార్టర్ చేయించుకునే అవకాశం ఉన్నదని, ఉద్యోగాలు ఇవ్వకుండానే క్వార్టర్ ఖాళీ చేయలేదనే పేరు మీద రిటైర్డ్ కార్మికులకు లాభాల వాటా, దీపావళి బోనస్ ఆపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఇది కూడా ఏఐటీయూసీ వైఫల్యమే అని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికెల సంపత్ కుమార్, బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస రావు, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఓ రాజశేఖర్, సెంట్రల్ కమిటీ నాయకులు రాజనాల రమేష్, అశోక్, గోలేటి సిహెచ్పి ఫిట్ కార్యదర్శి మెరుగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.